ఇప్పుడిప్పుడే పట్టణంగా ఎదుగుతున్న ఏజెన్సీ ప్రాంతం.. సీలేరు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఈ ఊరిలో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు తూర్పు గోదావరి జిల్లా నుండి వచ్చింది నక్కా జ్ఞానేశ్వర రావు గారి కుటుంబం. మొదట్లో వ్యవసాయం చేసిన ఆయన, తర్వాత శ్రీ బాలాజీ ఫ్యామిలీ రెసిడెన్సీ అండ్ రెస్టారెంట్ ను పెట్టాడు. అప్పుడే అక్కడికి గర్భిణులు ఎక్కువగా రావడం గమనించాడు. వారందరూ మారుమూలన ఉన్న పర్వత ప్రాంతాల నుంచి సీలేరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వచ్చే గిరిజనులు. ఐతే వారి దగ్గర భోజనానికి సరిపడా డబ్బు ఉండేది కాదు. తమ దగ్గర ఉన్నదేదో చేతిలో పెట్టి వెళ్ళి పోయే వారు. ఆయన కూడా ఇంతే ఇవ్వాలి అని పట్టు పట్టేవారు కాదు. పోనుపోను వారిని డబ్బులు అడగడమే మానేశాడు జ్ఞానేశ్వర రావు. అలా 2018 నుండి వారికి ఉచితంగానే భోజనం పెడుతున్నాడు ఆయన.
కేవలం తన హోటల్ ను వెతుక్కుంటూ వచ్చే వారికి మాత్రమే కాకుండా , సీలేరు పీ హెచ్ సీ లో పని చేసే నర్సులకు రోజూ తన హోటల్ మీల్స్ టోకెన్లు ఇస్తున్నాడు. వారు దవాఖానకు వచ్చే గర్భిణులకు , వారి సహాయకులకు ఈ టోకెన్లు ఇచ్చి హోటల్ కు పంపిస్తున్నారు. అలా రోజూ కనీసం 20 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నాడు శ్రీ జ్ఞానేశ్వర రావు.
ఇక్కడ ప్రతి నెలా 9 వ తేదీన గర్భిణులకు అన్ని రకాల టెస్టులు చేస్తుంటారు. ఆ సమయంలో వంద మంది కి పైగా వస్తుంటారు. ఆ రోజున తన భార్య నాగమణితో కలిసి హోటల్ నుండి తానే స్వయంగా భోజనం తీసుకెళ్లి ఇస్తుంటాడు ఆయన.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి