విద్య అనేది ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు ఒక కుటుంబం భవిష్యత్తును, సమాజం యొక్క అభివృద్ధిని మార్చ గలిగే శక్తి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తే వారి జీవితాలలో ఒక మంచి మార్పు అనేది వస్తుంది. ఈ ఆలోచనతోనే తెలంగాణలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విద్యాసంస్థలలో మౌలిక వసతులు మెరుగు పరచడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు వినూత్నమైన చర్యలు చేపడుతుంది. ఈ ప్రయత్నాలకు సాంకేతికని జోడిస్తూ టీ శాట్ చేస్తున్న కృషి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది .విద్యార్థి పునాదులు పాఠశాల స్థాయి నుండే బలోపేతం కావాలని లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతుంది. అదే బాటలో పయనిస్తూ ఇటీవల టీ శాట్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ తో ప్రసారాలపై ఎం ఓ యు కుదుర్చుకున్నది.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి కూడా ప్రైవేట్ విద్యా సంస్థలో చదివే విద్యార్థితో సమానమైన నాణ్యమైన విద్య అందాలన్నదే ప్రభుత్వ విద్య వ్యవస్థ లక్ష్యం కావాలనే మనం కోరుకుంటాం. అయితే తరగతి గదిలో మంచి బోధనతో పాటు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, మోడల్ పరీక్షలు, ప్రాక్టీస్ టెస్టులు, కెరీర్ మార్గదర్శకత్వం కూడా అవసరపడుతుంది. ఈ అవసరాన్ని గుర్తించి తమ కార్యక్రమాలను క్రమంగా విస్తరిస్తున్న టీ శాట్ ఇటీవల నిర్వహించిన ఎప్ సెట్ డిజిటల్ కోర్స్ ఇందుకు మంచి ఉదాహరణ. ఇందులో భాగంగా 112 రోజుల పాటు 450 అకాడమిక్ మాడ్యూల్స్ ను ప్రసారం చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ,బోటనీ, జువాలజీ లాంటి ప్రధాన సబ్జెక్టులపై నిపుణులతో డిజిటల్ పాఠాలను అందించింది. టీవీ ప్రసారంతో పాటు డిజిటల్ వేదికల ద్వారా కూడా విద్యార్థులకు ఈ ఉచిత డిజిటల్ కంటెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. ఇక్కడ టీ శాట్ ప్రత్యేకత కేవలం పాఠాలు చెప్పడం లోనే లేదు, విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యే విధంగా మోడల్ పరీక్షలు, ప్రాక్టీస్ ప్రశ్నలు, సబ్జెక్టు వారీగా పరీక్షా సన్నద్ధత, పరీక్ష విధానం పై అవగాహన వంటి అంశాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని విద్యార్థులకు ఇలాంటి" ఉచిత డిజిటల్ కంటెంట్ " ఎంతో ఉపయోగకరం. ఎప్ సెట్ తో పాటు జేఈఈ మెయిన్స్, పాలిసెట్, గురుకుల సెట్, పీజీ సెట్, గ్రూప్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్ బి,పోలీసు ఉద్యోగాలు, డీఎస్సీ, టెట్ వంటి వివిధ పోటీ పరీక్షలకు కూడా టీ శాట్ ప్రత్యేక కార్యక్రమాలను ఉచితంగా అందిస్తుంది.
ఆగస్టు 22న పాఠశాల విద్యా డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ టీ శాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి మధ్య కుదిరిన ఒప్పందం పాఠశాల విద్య వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ ఒప్పందం ద్వారా 9, 10 తరగతుల విద్యార్థులకు సాయంత్రం వేళల్లో డిజిటల్ పాఠాలను టీ శాట్ ద్వారా ప్రసారం చేయనుండడంతో పాఠశాలల ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పునఃశ్చరణ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు రాష్ట్రంలోని సుమారు 28 వేల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాలు ,మా జిల్లా మా పాఠశాల, ఉపాధ్యాయుల కోసం నిర్వహించే టిఎల్ఎం మేళాలు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలు కూడా టీ శాట్ లో ప్రసారమవుతాయి. టీ శాట్ వివిధ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థలు, విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడం ప్రభుత్వ విద్య బలోపేతానికి సానుకూలంగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.ఇటీవల మహాత్మా గాంధీ యూనివర్సిటీ తో కుదిరిన ఎం ఓ యు తో ఆన్లైన్ లో విద్యా అవకాశాలను విస్తరించడానికి చర్యలు చేపట్టారు. టీ శాట్ పేద విద్యార్థికి "ఉచిత డిజిటల్ కోచింగ్ సెంటర్". గ్రామీణ విద్యార్థికి "నాణ్యమైన విద్యా వేదిక". పోటీ పరీక్షల అభ్యర్థికి "మార్గదర్శి" .ప్రభుత్వ విద్య కోసం "సాంకేతిక బలం" అని చెప్పవచ్చు.