ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు ఉచిత ప్రయాణం అని రాసి ఉన్న గులాబీ రంగు ఆటో చెన్నై లో అందరినీ ఆకర్షిస్తుంటుంది. చెన్నై లోని టీ నగర్, కోడంబాక్కం, అన్నా నగర్, పెరంబూర్ ప్రాంతాలలో గత కొన్ని సంవత్సరాలుగా తన ఆటోలో ఉచితంగా అమ్మాయిలను తీసుకు వెళుతోంది " రాజీ అశోక్"
54 ఏళ్ల రాజీ అశోక్ ఆర్థిక సమస్యల కారణంగా కాలేజీ చదువును అర్ధాంతరంగా మానివేసింది. తన చదువు కొనసాగి ఉంటే జీవితం బాగుండేదని అనుకుంటూ ఉంటుంది. తనలాగే ఇతరులు చదువు మధ్యలో మానేయకుండా ఉండాలని తన వంతు సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రాజీ అశోక్.
ప్రతి రోజూ విద్యార్థినులను బడిలో దింపి సాయంత్రం తిరిగి తీసుకు వస్తుంది రాజీ. రోజూ 10 నుంచి 15 మంది బాలికలకు సహాయం చేస్తుంది. ఇలా చేయడం అంటే తన సంపాదనలో ఎంతో కొంత వదులుకోవడమే. ఐతే అదేమీ తనకు ఇబ్బందిగా లేదు. స్కూల్, బస్ స్టాప్, ఆటో స్టాండ్ దగ్గర పిల్లల కోసం వేచి చూస్తాను. గులాబీ రంగు ఆటో ను గుర్తు పట్టి వెంటనే ఎక్కేసారు. నన్ను చూడగానే వారికి సంతోషంగా ఉంటుంది. సౌకర్యంగా కూర్చుంటారు. ఆకలి వేస్తే తినడానికి ఆటోలో బిస్కట్ ప్యాకెట్లు ఎప్పుడూ ఉంటాయి అంటుంది రాజీ అశోక్.
ఎప్పుడో ఎక్కిన పిల్లలు సంతోషంగా పలకరించడం,వారి తల్లిదండ్రులు ఆప్యాయంగా పలకరిస్తుంటే వెయ్యి ఏనుగుల బలం వస్తుంది, అంతులేని ఉత్సాహం వస్తుంది, ఇంకా ఏదైనా చేయాలని అనిపిస్తుంది అంటుంది రాజీ.
నేను రాజీ అక్క ఆటోలో ప్రయాణించాను అని ఎంతో మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు, వాటికి ప్రశంసలూ వస్తుంటాయి.. అవి నాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంటాయి అన్నారు రాజీ..
వయసు 54 ఏళ్ళు కావడంతో స్వస్థలానికి తిరిగి వెళ్ళాలనిపించి ఇంటికి వెళ్ళిపోయారు రాజీ.మనసు మాత్రం చెన్నై ని వదలలేదు.. మళ్ళీ చెన్నై వచ్చేశారు. రాజీ భర్త ఒక సంస్థ ఇచ్చిన అంబులెన్స్ తో కేరళలో ఉచితంగా సేవ చేస్తుండడం, రాజీ కూడా చెన్నైలో తన వంతు సేవ చేస్తుండడం మనసుకేంతో ఆనందంగా ఉందంటారు రాజీ. చిన్న పాటి ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతుంటారు రాజీ. ఒక పెద్ద ఆటో ఉంటే మరింత మంది కి సేవ చేయగలుగుతాను అంటారు రాజీ.

