గ్రామీణ ప్రాంత యువతి యువకులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంతోపాటు , సొంత కాళ్లపై నిలబడాలని ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ అన్నారు. సోమవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు అందించనున్న ఉచిత వృత్తి విద్యా, నైపుణ్య శిక్షణ కోర్సులకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతి యువకులకు "ఉచితంగా సాంకేతిక, వృత్తి నైపుణ్య శిక్షణ " అందిస్తూ వారిని ఉపాధి వైపు నడిపించేందుకు ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమన్నారు. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు .
శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించడంతోపాటు యూనిఫారం, షూస్ ,బ్యాగ్ తదితర మెటీరియల్ ను ఉచితంగా అందజేస్తారని ఆయన తెలిపారు. కోర్స్ ను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఎన్ ఎస్ డి సి గుర్తింపు పొందిన సర్టిఫికెట్ అందించడంతోపాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు .గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కోరారు.
18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతి యువకులు శిక్షణకు అర్హులని ఆదిలాబాద్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పసుల రమేష్ తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారితో పాటు ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంఓఏ కంప్యూటర్ ట్రైనింగ్, సోలార్ టెక్నీషియన్, ఆటోమోటివ్- టూ వీలర్, ఫోర్ వీలర్ మెకానిక్, హోటల్ మేనేజ్మెంట్ ,హాస్పిటాలిటీ, ఎలక్ట్రికల్ అండ్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, హెల్త్ కేర్- జి డి ఏ, నర్సింగ్ అసిస్టెంట్, బ్యూటీ అండ్ వెల్ నెస్ తదితర కోర్సులలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు ఆయన వివరించారు.
మరిన్ని సమగ్ర వివరాలకు 63036 03145 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పసుల రమేష్, తుక్కారెడ్డి రాజేందర్ రెడ్డి ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
