అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసులలో జరిగినట్లుగానే కడప కలెక్టరేట్ లో కూడా ప్రతి సోమ వారం గ్రీవెన్స్ డే జరుగుతుంది. చుట్టు పక్కల ఊర్ల నుండి వందలాది మంది ప్రజలు వినతి పత్రాలు తీసుకుని వస్తుంటారు. పెన్షన్ దరఖాస్తుల కోసం, ఇతర సహాయాల కోసం, అర్జీలు పెట్టుకుని అధికారుల వంక ఆశగా చూస్తుంటారు. అందుకే దానిని అధికారికంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పిలుస్తుంటారు. అక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో తెలియదు కానీ వచ్చిన వారి ఆకలి మాత్రం తీరుతుంది. అలా అర్జీలు పట్టుకుని అక్కడికి వచ్చే వారందరికీ కడుపు నిండా భోజనం పెడుతున్నారు శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. గత 12 సంవత్సరాల నుంచి ఒక యజ్ఞం లా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు ఈ ఉచిత అన్నదానాన్ని శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. రాయల సీమ లో తొలి ప్రైవేటు న్యాయ కళాశాలను స్థాపించిన వ్యక్తి ఆయన.
1986 లో నాటి ముఖ్య మంత్రి శ్రీ ఎన్టీరామారావు గారి మీద అభిమానంతో బసవరామ తారకం న్యాయ కళాశాల అని పేరు పెట్టారు ఆయన. 2015 లో గోవర్ధన్ రెడ్డి గారు కడప కలెక్టరేట్ కు పని మీద వచ్చినప్పుడు , అర్జీలు పట్టుకుని మధ్యాహ్నం వరకు అధికారుల కోసం పడిగాపులు కాస్తూ ఆకలితో అలమటిస్తున్న ప్రజలను చూసారట ఆయన. ఈ దుస్థితిని తొలగించాలని నాటి నుంచి ఈ అన్న యజ్ఞాన్ని ప్రారంభించారు. దీని కోసం నెలకు దాదాపు 50 వేల రూపాయలు వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పోలీసు అధికారిగా పనిచేసిన తన తండ్రి ,తల్లితో కలిసి ప్రతి రోజూ కొంత మంది పేదవారికి ఇంటి వద్ద అన్నం పెట్టేవారని , నేను దానిని కొనసాగిస్తున్నాను, అంతే అంటారు వినమ్రంగా శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు.