జై జవాన్ అంటాము. వీర సైనికా వందనం అంటూ నినాదాలు చేస్తాము. ఆ సైనికులు, వాళ్ళ కుటుంబము క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటాము . నిజంగానే మన దేశము వాళ్ళని కంటికి రెప్పలాగే కాపాడుకుంటున్నది. సేవలలో ఉన్నప్పుడూ, ఆ తర్వాత మంచి ప్రయోజనాలు అందిస్తుంది .కాకపోతే అవన్నీ అందరికీ అందడం లేదు. ఇది నిజం. ముఖ్యంగా 15 ఏళ్ల కన్నా తక్కువ సర్వీస్ ఉన్న వాళ్లకి చేరడం లేదు .దాంతో వాళ్ళ స్థితి దుర్భరంగా మారుతుంది. అలాంటి కుటుంబాలకి సహాయపడుతున్నాడు 36 ఏళ్ల గౌరవ శుక్ల. ప్రతి సంవత్సరం సుమారు 70 కోట్ల రూపాయల ఖర్చుతో వారి అవసరాలు తీరుస్తున్నాడు.
దిగ్రేష్ కుమార్ సైన్యంలో ఇంజనీర్ గా ఉండేవాడు. దుర్గమ మైన ప్రాంతాలలో సైన్యం వెళ్లడానికి మార్గాన్ని నిర్మించే" షాపర్గా" సేవలందించాడు. 13 ఏళ్ల సర్వీస్ తర్వాత అతని మానసిక స్థితి దెబ్బతిన్నది. సైన్యం అతనికి రిటైర్మెంట్ ఇచ్చింది. మామూలుగా 15 ఏళ్లు పూర్తయ్యాక పదవి విరమణ పొందిన వాళ్లకి సైన్యం పెన్షన్ ఇస్తుంది .కాబట్టి దిగ్రేష్ కి ఆ ప్రయోజనం దక్కకుండా పోయింది . చేతికొచ్చిన గ్రాట్యూటీ రూపాయలు అతని చికిత్సకే సరిపోయాయి. అదీ ఫలించక చివరికి దిగ్రేష్ చనిపోయాడు. అప్పుడు ఆయన భార్య రోషినికి 42 ఏళ్ళు. పాప ఎనిమిదో తరగతి చదువుతుండేది. రోషిని తాను ఉంటున్న ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌లో మరే ఆదాయ వనరు లేక ఉపాధి హామీ పనులకి వెళ్ళసాగింది. రహదారి నిర్మాణంలో రాళ్ళు ఎత్తింది. అది కూడా మూడు నాలుగు నెలలే, మిగతా రోజులలో అర్థాకలి తో పస్తులు ఉండేది. ఆ కుటుంబం గురించి గౌరవ శుక్లాకి తెలిసింది .తన సపోర్ట్ అవర్ హీరోస్ సంస్థ ద్వారా 60 వేల రూపాయలతో ఆమె చేత పూజా సామాగ్రి షాపు పెట్టించాడు గౌరవ శుక్లా. ఆరు నెలల్లోనే నెలకి 10,000 వరకు ఆదాయం అందుకోసాగింది రోషిని. అక్కడితో ఆగలేదు పుట్టగొడుగుల సాగునీ మొదలు పెట్టింది. ప్రస్తుతం మరో నలుగురు మహిళలకి ఉపాధి కల్పిస్తోంది ఆమె.
రేష్మిత ఇంజనీరింగ్ చదువుకుంటుంది. తన తమ్ముడు జ్ఞానేశ్వర రావు.. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి. అటు రేష్మిత కాలేజీలోనూ ఇటు జ్ఞానేశ్వర్ రావుచదువు తున్న స్కూల్లోనూ ఎవరైనా చెబుతారు, ఆ ఇద్దరూ ఎంతటి ప్రతిభావంతులు అనేది. కానీ ఐదారు నెలల కిందట ఆ ప్రతిభ దీపం మునిగపోయే పరిస్థితి వచ్చింది. రేష్మిత జ్ఞానేశ్వర్ల తండ్రి మాజీ సైనికుడు అయిన చంద్రశేఖర రావు కి వెన్నుపాములో కనితి ఏర్పడి పడకకే పరిమితమయ్యాడు. ఆ అనారోగ్యంతోనే రెండేళ్ల కిందట చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైది. ప్రభుత్వం ఇచ్చే వితంతు పెన్షన్ ఇంటి ఖర్చులకి సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలోనే రేష్మిత, జ్ఞానేశ్వర్ల చదువు బాధ్యతను తీసుకున్నది ఎస్ఓహెచ్ సంస్థ .వాళ్లకు కావాల్సిన ఫీజులు తనే చెల్లిస్తోంది. ఇలా ఒకటి, రెండు కాదు మన దేశంలో 22 రాష్ట్రాలకు చెందిన 350 మాజీ జవాన్ల కుటుంబాలను ఆదుకుంటుంది ఈ సంస్థ. వాళ్లలోనూ 65 ఏళ్లు పైబడిన వారికి శాశ్వత ప్రాతిపదికన నెలవారి వెచ్చాలు, ఔషధాలు, పిల్లలకు ఫీజులు ఇతరత్రా ఆర్థిక సహాయాలు అందిస్తోంది. 36 ఏళ్ల గౌరవ శుక్లా దీని వ్యవస్థాపకుడు. గౌరవ్ దీనిని ప్రారంభించడం వెనక గుండెని కదిలించే నేపథ్యం ఉంది.
పీతాంబరం తాతతో..
గౌరవ శుక్లాది ఢిల్లీ .తండ్రి మాజీ జవాన్. కార్గిల్ యుద్ధంలో పోరాడినవాడు. తండ్రిలాగే తాను సైనికుడు కావాలనుకున్న గౌరవ్ సెలెక్ట్ కాలేదు. దానితో టీవీ జర్నలిజంలో డిగ్రీ చేసి, బాలీవుడ్లో క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2014 ప్రాంతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మాజీ సైనికులు నిర్వహించిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఆందోళనలు అతని జీవితాన్ని మార్చేశాయి. ఆ రోజు నుంచి పెన్షన్ లేని సైనికుల జీవితాల గురించి పరిశోధన మొదలుపెట్టాడు. వీడియో కథనాలు చేయసాగాడు. అప్పుడే ఒక ఫోటో అతని కంటపడిందట. అది పీతాంబరం తాత ఫోటో. ఆయన 1965, 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో సిగ్నల్ మెన్ గా పనిచేసిన వాడు .అనారోగ్యంతో ఉన్న తన తల్లికి సపర్యలు చేయాలని 1975లో పదేళ్ల సర్వీస్ తర్వాత సైన్యం నుంచి బయటకు వచ్చేసాడు. పెళ్లి చేసుకోలేదు. 1980లో తల్లి చనిపోతే ఒంటరిగా మిగిలాడు. పెన్షన్ లేదు కాబట్టి అన్ని రకాల పనులు చేశాడు. 75 ఏళ్ల తర్వాత కాలు విరిగి పనిచేసే శక్తి లేక ఢిల్లీ కన్నాట్ ప్లేస్ లో బిచ్చగాడిగా మారిపోయాడు .ఆ ఫోటోనే నేను చూసింది. నేను ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళగానే ఇంత కాలానికి నన్ను పలకరించే వారు వచ్చారా అంటూ బోరును ఏర్చాడు పితాబరం తాత. ఆయనకి నెల నెలా వెచ్చాలు, మందులను అందించడంతోటే మా ఎస్ఓహెచ్ సంస్థ ప్రారంభమైనది అంటాడు గౌరవ శుక్ల.
నెల నెలా 6 కోట్ల రూపాయలు..
మొదట్లో తన సొంత సంపాదనతోనే మాజీ జవాన్లకు సహాయం చేసినా..పోను పోను రోటరీ వంటి సంస్థలు గౌరవ్ తో చేతులు కలిపాయి. ఆ తర్వాత మాజీ సైనిక అధికారుల సంఘాలు ,ఇతర వితరణ శీలురు అతనితో కలిసి నడవసాగారు. ఆ రకంగా 350 కుటుంబాలకి కావలసిన వివిధ అవసరాల కోసం నెల నెలా 6 కోట్ల రూపాయల మేర ఖర్చు పెడుతున్నాడు. భారతీయులందరి తరఫున మాజీ జవాన్ల రుణం తీర్చుకుంటున్నాడు గౌరవ శుక్ల తన సపోర్ట్ అవర్ హీరో సంస్థతో.