ఫ్రీ ఎడ్యుకేషన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫ్రీ ఎడ్యుకేషన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, సెప్టెంబర్ 2026, ఆదివారం

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వాళ్ళకీ దూరంగా ఉన్నామన్న బాధని పోగొట్టుకోవడానికి నెలనెలా సంగీత కచేరీలు ఏర్పాటు చేసేవాడు. 2003 లో కర్ణాటక పశ్చిమ కోస్తాలోని కర్కల గ్రామంలో .. తుఫానుకి ఓ బడి కూలిపోవడం .. అక్కడి ప్రధానోపాధ్యాయుడు తమకు సాయం చేయమని అడగడం .. అతన్ని ఆలోచనలో పడేసింది. నేను మాత్రమే కాదు సిలికాన్ వ్యాలీకి వచ్చిన నాలాంటి తొలి తరం ఐటీ నిపుణులందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారమే.. అవి ఇలా కుప్ప కూలిపోతున్న దైన్యం మా గుండెల్ని పిండేసింది. అలా నా మిత్రులతో కలిసి కర్కలలోని బడిని పాతిక లక్షల రూపాయలతో బాగు చేసి ఇచ్చాం. అప్పటి నుంచి ఏటా ఒక పాఠశాలను బాగు చేయాలన్న లక్ష్యంతోనే నేనూ నా మిత్రులం 40 మందిమి కలిసి " ఒన్ స్కూల్ ఎట్ ఏ టైం " ( ఓ శాట్ ) ను స్థాపించాము.. అని గుర్తు చేసుకుంటాడు భట్. ఏడాదికి ఒక్క స్కూల్ నే బాగు చేయాలనుకుని మొదలైన సంస్థ ఇప్పుడు ఏటా 30 బడుల్ని తీర్చి దిద్దుతోంది. ఇప్పటిదాకా 150 బడుల్ని బాగు చేసింది. 

ఇలా పని చేస్తుంది..

ఈ మధ్య తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని ముత్తంగి గ్రామంలో ఓ జడ్పీ స్కూలును తీర్చి దిద్దేందుకోసం భూమి పూజ నిర్వహించింది ఓ శాట్ సంస్థ. అది జరుగుతున్న చోటకే క్వాల్కం కంపెనీలో ఓ ఐటీ నిపుణుడు వచ్చాడట . వచ్చీ రాగానే 10 లక్షల రూపాయలకు చెక్ ఇచ్చి .. ఈ పనులకి నా విరాళంగా ఉంచండి.. అని చెప్పాడట. తన పేరు ఎక్కడా బయటకు రాకూడదనీ చెప్పి వెళ్ళాడట. ఓ శాట్ సంస్థ పైన దాతలకు ఉన్న నమ్మకానికి ఇదో ఉదాహరణ. ఇలా ప్రతి ప్రాజెక్టుకి సాయపడే సాంకేతిక నిపుణులూ,ఎన్నారైల సాయంతోనే ఈ సంస్థ ఎన్నో గ్రామీణ బడుల్ని పునరుద్ధరిస్తోంది. ఆ సరస్వతి నిలయాలను ఎంతో మంది అజ్ఞాత దాతల నిస్వార్థ గుణానికీ, సేవా తత్పరతకు సాక్ష్యంగా నిలుపుతుంది.

28, ఆగస్టు 2026, శుక్రవారం

ఉచిత డిజిటల్ కంటెంట్@టీ - శాట్

 విద్య అనేది ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు ఒక కుటుంబం భవిష్యత్తును, సమాజం యొక్క అభివృద్ధిని మార్చ గలిగే శక్తి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తే వారి జీవితాలలో ఒక మంచి మార్పు అనేది వస్తుంది. ఈ ఆలోచనతోనే తెలంగాణలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విద్యాసంస్థలలో మౌలిక వసతులు మెరుగు పరచడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు వినూత్నమైన చర్యలు చేపడుతుంది. ఈ ప్రయత్నాలకు సాంకేతికని జోడిస్తూ టీ శాట్ చేస్తున్న కృషి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది .విద్యార్థి పునాదులు పాఠశాల స్థాయి నుండే బలోపేతం కావాలని లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతుంది. అదే బాటలో పయనిస్తూ ఇటీవల టీ శాట్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ తో ప్రసారాలపై ఎం ఓ యు  కుదుర్చుకున్నది.

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి కూడా ప్రైవేట్ విద్యా సంస్థలో చదివే విద్యార్థితో సమానమైన నాణ్యమైన విద్య  అందాలన్నదే ప్రభుత్వ విద్య వ్యవస్థ లక్ష్యం కావాలనే మనం కోరుకుంటాం. అయితే తరగతి గదిలో మంచి బోధనతో పాటు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, మోడల్ పరీక్షలు, ప్రాక్టీస్ టెస్టులు, కెరీర్ మార్గదర్శకత్వం కూడా అవసరపడుతుంది. ఈ అవసరాన్ని గుర్తించి తమ కార్యక్రమాలను క్రమంగా విస్తరిస్తున్న టీ శాట్ ఇటీవల నిర్వహించిన ఎప్ సెట్ డిజిటల్ కోర్స్  ఇందుకు మంచి ఉదాహరణ. ఇందులో భాగంగా 112 రోజుల పాటు 450 అకాడమిక్ మాడ్యూల్స్ ను ప్రసారం చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ,బోటనీ, జువాలజీ లాంటి ప్రధాన సబ్జెక్టులపై నిపుణులతో డిజిటల్ పాఠాలను అందించింది. టీవీ ప్రసారంతో పాటు డిజిటల్ వేదికల ద్వారా కూడా విద్యార్థులకు ఈ ఉచిత డిజిటల్ కంటెంట్ అందుబాటులో  ఉండేలా చర్యలు తీసుకుంది. ఇక్కడ టీ శాట్ ప్రత్యేకత కేవలం పాఠాలు చెప్పడం  లోనే లేదు, విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యే విధంగా మోడల్ పరీక్షలు, ప్రాక్టీస్ ప్రశ్నలు, సబ్జెక్టు వారీగా పరీక్షా సన్నద్ధత, పరీక్ష విధానం పై అవగాహన వంటి అంశాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రవేశ పరీక్షలకు  సన్నద్ధం అయ్యేందుకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని విద్యార్థులకు ఇలాంటి" ఉచిత డిజిటల్ కంటెంట్ " ఎంతో ఉపయోగకరం. ఎప్ సెట్ తో పాటు జేఈఈ మెయిన్స్, పాలిసెట్, గురుకుల సెట్, పీజీ సెట్, గ్రూప్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్ బి,పోలీసు ఉద్యోగాలు, డీఎస్సీ, టెట్ వంటి వివిధ పోటీ పరీక్షలకు కూడా టీ శాట్ ప్రత్యేక కార్యక్రమాలను ఉచితంగా అందిస్తుంది.

ఆగస్టు 22న పాఠశాల విద్యా డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ టీ శాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి మధ్య కుదిరిన ఒప్పందం పాఠశాల విద్య వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ ఒప్పందం ద్వారా 9, 10 తరగతుల విద్యార్థులకు సాయంత్రం వేళల్లో డిజిటల్ పాఠాలను టీ శాట్ ద్వారా ప్రసారం చేయనుండడంతో పాఠశాలల ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పునఃశ్చరణ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు రాష్ట్రంలోని సుమారు 28 వేల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాలు ,మా జిల్లా మా పాఠశాల, ఉపాధ్యాయుల కోసం నిర్వహించే టిఎల్ఎం మేళాలు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలు కూడా టీ శాట్ లో ప్రసారమవుతాయి. టీ శాట్ వివిధ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థలు, విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడం ప్రభుత్వ విద్య బలోపేతానికి సానుకూలంగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.ఇటీవల మహాత్మా గాంధీ యూనివర్సిటీ తో కుదిరిన ఎం ఓ యు  తో ఆన్లైన్ లో విద్యా అవకాశాలను విస్తరించడానికి చర్యలు చేపట్టారు. టీ శాట్ పేద విద్యార్థికి "ఉచిత డిజిటల్ కోచింగ్ సెంటర్". గ్రామీణ విద్యార్థికి "నాణ్యమైన విద్యా వేదిక". పోటీ పరీక్షల అభ్యర్థికి "మార్గదర్శి" .ప్రభుత్వ విద్య కోసం "సాంకేతిక బలం"  అని చెప్పవచ్చు. 

21, ఆగస్టు 2026, శుక్రవారం

ఏడాది పాటు " ఫ్రీ గూగుల్ ఏ ఐ ప్లస్"

 విద్యార్థులకు గూగుల్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.. 

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతీయ కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది." గూగుల్ ఏ ఐ ప్లస్" సబ్ స్క్రిప్షన్ ను" ఏడాది పాటు ఉచితంగా" అందించనున్నట్లు ప్రకటించింది.

గూగుల్ ఏ ఐ అసిస్టెంట్,సెర్చ్ ద్వారా ఎడ్యుకేషనల్ టూల్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది . అమెరికా లోని కాలేజీ విద్యార్థులకు గూగుల్ ఏ ఐ ప్రో ప్లాన్ ను ఉచితంగా అందిస్తుండగా.. ఇప్పుడు భారతీయ కాలేజీ విద్యార్థుల కోసం " గూగుల్ ఏ ఐ ప్లస్" ను తీసుకు రానున్నది.

20, ఆగస్టు 2026, గురువారం

ఫిజిక్స్ వాలా నేషనల్ స్కాలర్ షిప్ కం అడ్మిషన్ టెస్ట్ 2026

 నీట్ , జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఫిజిక్స్ వాలా నేషనల్ స్కాలర్షిప్ కం అడ్మిషన్ టెస్ట్ 2026 నాలుగవ ఎడిషన్ను ప్రకటించింది .ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్, ఫిజిక్స్ ,కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలకు చెందిన ఐదు నుంచి 12వ తరగతి విద్యార్థులు, 12వ తరగతి పాసైన విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు" ఉచితంగా పేర్లను నమోదు"  చేసుకోవచ్చని వెల్లడించింది. అర్హులైన విద్యార్థులు 100% వరకు ట్యూషన్ ఫీజు మినహాయింపు తో కూడిన స్కాలర్షిప్ లను పొందవచ్చని, అర్హులైన మొదటి 500 మంది విద్యార్థులకు" ఉచిత విద్యను ఉచిత హాస్టల్ వసతిని"  కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఆన్లైన్ పరీక్షను ఎంచుకునే విద్యార్థులు అక్టోబర్ 1 నుంచి 15 మధ్య పరీక్షకు హాజరు కావచ్చు అని, ఆఫ్లైన్ పరీక్షలు అక్టోబర్ 3,4, 10, 11 తేదీలలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. 

17, ఆగస్టు 2026, సోమవారం

ఉచిత శిక్షణ @ ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్

 ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణంలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన "ఉచిత పోటీ పరీక్షల శిక్షణ శిబిరాన్ని"  తెలంగాణ ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం ఆదివారము ప్రారంభించారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు" మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ"  అందించనున్నామని ఆయన తెలిపారు .ఈ సమావేశంలో ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం మాట్లాడుతూ ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 2015 లో ప్రారంభించామని అప్పటినుండి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు, నకిరేకల్ పట్టణంలో "ఉద్దీపన పాఠశాల" ఏర్పాటు చేసి" ఉచిత విద్య"  అందిస్తున్నామని పేర్కొన్నారు. 

కరోనా సమయంలో కషాయ కేంద్రాలు, అవసరమైన కిట్ల పంపిణీ చేశామని, మృతుల అంత్యక్రియలలో కూడా దగ్గరుండి మానవతా సేవలు అందించామని గుర్తు చేశారు. నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, నకిరేకల్ పట్టణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఉచిత శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువతకు అండగా నిలిచి లక్ష్య సాధనకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.



 ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, సీనియర్ నాయకులు పూజర్ల శంభయ్య ,చామల శ్రీనివాస్, నాగులవంచ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ బెల్లి యాదయ్య, ఆర్సి రెడ్డి కోచింగ్ అధ్యాపకులు వేముల సైదులు, మండల పార్టీ అధ్యక్షుడు గాధగోని కొండయ్య, టౌన్ అధ్యక్షులు లింగాల వెంకన్న , ఉద్దీపన కోఆర్డినేటర్ చెరుకు సతీష్, మాజీ కౌన్సిలర్లు ,నాయకులు ,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

16, ఆగస్టు 2026, ఆదివారం

కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ఉచిత సేవలు

 నిరుపేద విద్యార్థుల ముఖాలలో చిరునవ్వులు పూయిస్తూ వారి ఉన్నత చదువులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ ప్రణీత్ గ్రూప్ అధినేత నరేంద్ర కుమార్ కామరాజు ఆదర్శంగా నిలుస్తున్నారు. జీవితంలో రాణించాలంటే చదివే కీలకమని నమ్మిన వ్యక్తి ఆయన .ఆర్థిక సమస్యతో ఆ చదువు నిరుపేద విద్యార్థుల నుంచి దూరం కావద్దని తపన పడే మనిషి. అందుకే తన చిన్నప్పుడు మనకు ఉన్నంతలో ఇతరులకు సాయం చేయాలని నాయనమ్మ చెప్పిన మాటలు ఇప్పుడు అతని సేవా కార్యక్రమానికి ప్రేరణ నిస్తున్నాయి .ఇప్పటివరకు నగరంలో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులకు స్పోర్ట్స్ షూస్, స్కూల్ బ్యాగులు ,వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. పదో తరగతిలో 500 మార్కులు దాటిన ఆయా  స్కూళ్లకు చెందిన 43 మంది విద్యార్థులకు తన నాయనమ్మ పేరు మీద ఏర్పాటు చేసిన" కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్"  ద్వారా ఒక్కొక్కరికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ మొత్తంగా 21 లక్షల రూపాయలు ప్రకటించారు. అయితే ఈ స్కాలర్షిప్ సహాయం ప్రతి ఏడాది కొనసాగనున్నది. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్న ప్రణీత గ్రూప్ అధినేత నరేంద్ర కుమార్ కామరాజు ట్రస్ట్ కార్యక్రమాల గురించి ఈ విధంగా వివరించారు. 



2007లో ప్రణీత్ గ్రూప్ కంపెనీ ఏర్పాటు చేసిన నరేంద్ర కుమార్ గారు అంచలంచలుగా సాగిన తన ప్రస్థానంలో వారి నాయనమ్మ గారు తరచూ చెప్పిన మాటలు తనను చాలా ప్రభావితం చేశాయన్నారు. తన తొలి జీతం మూడు వేల రూపాయలు వచ్చినప్పుడు కూడా అందులో 300 రూపాయలు సహాయం చేసే వాడిని .అన్నపూర్ణమ్మ ట్రస్ట్ తో స్కాలర్షిప్లు ఇవ్వడమే కాకుండా ఇప్పటివరకు 250 మంది విద్యార్థులను ఇంజనీరింగ్ ,ఎంబీఏ, ఎంసీఏ చదివించానని, ఇలా సహాయం అందుకున్న విద్యార్థులు చాలా గొప్ప స్థానాలలో ఉన్నారని.. ఒక విద్యార్థి అమెరికాలో స్థిరపడి తన ట్రస్ట్ మరిన్ని కార్యక్రమాలు చేయాలని తనవంతు సహాయం అందించాడని తెలిపారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా టీచర్లు ఉండకుండా ఉన్న సమస్యతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులలో సాధ్యమైనంత వరకు సంబంధిత పాఠశాలలో మంచి టీచర్లను నియమించే బాధ్యత ట్రస్ట్ తరఫున తీసుకుంటున్నామని ఆయన తెలిపారు .వారికి ట్రస్ట్ జీతాలు చెల్లిస్తుందని ,చాలామంది హెచ్ఎంలు తమ పాఠశాలలో టీచర్లను నియమించే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు .అందుకే మేము సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని వారి సూచనల మేరకు టీచర్ల నియామకానికి ప్రణాళికలు వేశామన్నారు. ఒక వ్యక్తి చదువుకొని బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుతుంది .చదువు లేకున్న సాధించే వారు చాలామంది ఉన్నారు, కానీ చదువు ఆయుధం లాంటిదని నేను బలంగా నమ్ముతున్నాను. మహా అయితే 15 ఏళ్లు చదువుతాము, ఆ తర్వాత అంతా జీవిత పోరాటమే. అందుకే ఆ చదువు ఫౌండేషన్ బలంగా ఉంటే విద్యార్థులు గొప్పగా  రాణిస్తారు .

నాయనమ్మ ఆదర్శం..

 సాయం, సేవ చేయాలని ఆలోచన నేను మా నాయనమ్మ నుంచే నేర్చుకున్నాను. నాయనమ్మ పేరు అన్నపూర్ణమ్మ. ఆమెది తన వద్ద ఉన్నదాంట్లో కొంత సహాయం చేసే మనస్తత్వం. సహాయం చేయాలనే మనస్తత్వం ఉంటే డబ్బే కాదు ,ఏ రూపంలోనైనా సహాయం అందించగలను అని చెబుతుండేది. పది మందికి సహాయం చేసే ఆలోచనలు నాటుకు పోయేలా చిన్నప్పటి నుంచి నూరి పోసింది .ఏడో తరగతి వరకు నన్ను ఎత్తుకొని ముద్దాడేది. నీ గురించే కాదు నీ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించమని చెబుతూ ఉండేది. ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మా ట్రస్ట్ కార్య కలాపాలకు ప్రేరణ మా నాయనమ్మ .ఈ సేవలు మరింత విస్తృతంగా చేయాలని ఆలోచనతో ఉన్నాము.ఇందుకు తగ్గ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుంది ఆయన తెలిపారు.  

ఒక స్కూల్లో, ఒక కాలేజీలో చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చాక, మళ్లీ ఆ స్కూల్ ,కాలేజీలో అడుగుపెట్టిన వారు ఎంతమంది ఉంటారు? మనం ప్రతిదీ ప్రభుత్వం నుంచి పొందాము. మరి మనం ప్రభుత్వం అందించిన ప్రయోజనాలను వినియోగించుకొని ఎదిగాము కదా.. మరి మనం ప్రభుత్వ పాఠశాలకు ఏం చేయగలుగుతున్నాము అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అంటారు నరేంద్ర కుమార్ కామరాజు .

తమ ట్రస్ట్ ను సంప్రదించాలి అనుకుంటే 7337252627 నెంబర్ కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. 



5, ఆగస్టు 2026, బుధవారం

ఉచిత విద్య@విద్యాఛాయ పాఠశాల@ సిలిగురి

 పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి పట్టణానికి చెందిన శక్తిపాల్ ది నిరుపేద కుటుంబం. అన్నం దొరకడమే కష్టమైన పరిస్థితుల్లో బాల కార్మికుడిగా మారాడు ఆయన. తర్వాత ఎంతో శ్రమించి సైన్యంలో చేరాడు. ప్రస్తుతం అస్సాం రైఫిల్స్ లో హవల్దార్ గా పని చేస్తున్నారు శ్రీ శక్తిపాల్. తన చిన్నప్పటి ఆకలి బాధలను మరచిపోలేదు శక్తిపాల్. తనకొచ్చే జీతంలో సగాన్ని వెచ్చించి రూ. 1 జనతా హోటల్ అనే పేరుతో సిలిగురిలో ఒక హోటల్ స్థాపించారు. 

ఇక్కడున్న ప్రభుత్వ ఆఫీసులకు,ఆసుపత్రులకు,ప్రయాణికులకు కడుపునిండా భోజనం పెడుతున్నాడు. మరి ఆ ఒక్క రూపాయి ఎందుకు అంటే..నేను నడిపే బడిలో వారిని ఏదో రకంగా భాగస్వాములను చేయాలి కదా అంటాడు.

విద్యా ఛాయ పేరుతో సిలిగురిలో ఒక పాఠశాలను నడుపుతున్నారు శక్తి పాల్ గారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే పేద వలస కార్మికుల పిల్లల సంక్షేమమే లక్ష్యంగా నడిచే ఈ బడిలో " ఉచితంగా చదువు " చెప్పడమే కాదు, రెండు పూటలా భోజనం పెడుతున్నాడు,ఉచితంగా బట్టలు,పుస్తకాలు అందిస్తున్నాడు శక్తి పాల్.ఇందుకోసం తన సంపాదనలో సగానికి పైగా వెచ్చిస్తున్నారు శక్తి పాల్..


3, ఆగస్టు 2026, సోమవారం

జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ లో ఉచిత విద్య

 అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో వంద శాతం ఉచిత విద్య అందించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వంచరెడ్డి శ్రీకాంత్, వ్యాగ్మారే సుభాష్ లు కోరారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ ను కలిసి వినతి పత్రం అందచేశారు. జిల్లా సందర్శనకు వచ్చిన విద్యా శాఖ కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా గారిని ప్రెస్ క్లబ్ కార్యవర్గం కలిసి ఉచిత విద్య అందించాలని వినతి పత్రం అందచేశారు. ప్రైవేట్ , కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య కోసం తగు చర్యలు తీసుకోవాలని ఆమె డీఈఓ గారికి ఆదేశాలు జారీ చేశారు. డీఈఓ గారు స్పందిస్తూ ఇతర జిల్లాల్లో ని ప్రొసీడింగ్స్ పరిశీలించి నిజామాబాద్ జిల్లాలో కూడా ఉచిత విద్య అందించేలా త్వరలో చర్యలు చేపడతామని తెలిపారు. 

2, జులై 2026, గురువారం

ఒడిశా లో ఉచిత విద్య

 కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ గతంలో ప్రకటించారు .బుధవారం రాత్రి ఆయన అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడింది. కార్యక్రమం తర్వాత మోహన్ స్వయంగా విలేకరులకు ఈ విషయం చెప్పారు .ఏడాదిలో 38 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ,రుసుములు ఉండవని స్పష్టం చేశారు. డ్రాప్ ఔట్లు తగ్గించడం, గుణాత్మకమైన విద్యా బోధనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

డిగ్రీ విద్యార్థులకు ఉచిత ఆర్ష విద్య ప్రశిక్షణ

 దేశభక్తి దైవభక్తి గల డిగ్రీ విద్యార్థులకు ఉచిత వసతితో ఆర్ష విద్య ప్రశిక్షణ ఇవ్వనున్నట్లు కామారెడ్డి ఆర్య సమాజం ప్రతినిధి ఆచార్య సత్య మిత్ర తెలిపారు. వివిధ కళాశాలలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు యధావిధిగా తమ కోర్సులతో పాటు ఆర్ష విద్యా ప్రశిక్షణ పొందవచ్చని పేర్కొన్నారు .

ప్రశిక్షణలో వాల్మీకి రామాయణం ,మహాభారతం, భగవద్గీత, ఉపనిషత్తులు ,షోడశ సంస్కారాలు, సత్యార్థ ప్రకాశం, ఋగ్వేదాది భాష్య భూమిక ,సంస్కృత భాష, వేదాంగ ప్రకాశ నేర్పిస్తారని ఆయన తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ప్రవేశాల కొరకు 79895 13668 మరియు 93475 91380 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

10, జూన్ 2026, బుధవారం

జర్మన్ భాషా శిక్షణ ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు

 నిరుద్యోగ యువతీ యువకులకు జర్మన్ భాష లో శిక్షణ ఇప్పించడం ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం టాస్క్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలోని ఇల్లందు క్లబ్లో ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి చంద్రయ్య, మండల తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, టాస్క్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ,  టామ్ కామ్ మేనేజర్ నాగభారతిలతో కలిసి ఆయన మాట్లాడారు.  అవకాశాలను పొందడంలో, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల ఉన్న వారిని ప్రోత్సహిస్తామని అన్నారు . ప్రపంచవ్యాప్తంగా అనేక ఉపాధి అవకాశాలు ఉన్నా యని ముఖ్యంగా జర్మనీలో నైపుణ్యం కలిగిన యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్న జర్మనీలో నర్సింగ్, సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో లక్షలాది ఉద్యోగాలలో ఖాళీలు ఉన్నాయని ,తెలంగాణ యువత అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ద్వారా జర్మన్ భాషా శిక్షణ అందిస్తుందని తెలిపారు. ఉద్యోగం ఎక్కడ లభిస్తే అక్కడికి వెళ్లి పని చేసే దృక్పథం యువత అలవర్చుకోవాలని అన్నారు. పారిశ్రామికవేత్తగా పనిచేసిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ మార్కెట్ ఉన్న ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించడం వలన వేలాది మందికి ఉపాధి కల్పించగలిగామని అన్నారు. స్థానికతకే పరిమితం కాకుండా అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు వెళ్లాలని యువతకు సూచించారు. జర్మనీలో వారానికి కేవలం 32 నుంచి 35 గంటల పని సమయం మాత్రమే ఉంటుందని మిగతా సమయంలో ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, జర్మనీలో నెలకు రెండు లక్షల 50 వేల రూపాయలు ఆపైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రైవేటు ఏజెన్సీల మోసాలకు గురి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన టాస్క్ ద్వారా శిక్షణ పొంది విదేశీ ఉద్యోగాలను పొందాలని తెలిపారు .ఇప్పటికే ఈ కార్యక్రమానికి 112 మంది యువత నమోదు చేసుకున్నారని, వారందరికీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ  అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం టామ్ కామ్ సంస్థకు 90 కోట్ల రూపాయలు అందించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రెండువేల రూపాయల స్టయిఫండ్ అందిస్తుందని, అదేవిధంగా జర్మన్ భాష శిక్షణ పొందుతున్న అభ్యర్థులలో 80 శాతం హాజర నమోదు చేసుకున్న వారికి కాకా వెంకటస్వామి ట్రస్ట్ తరఫున అదనంగా నెలకు ₹1000  స్టైపండ్ అందజేస్తామని తెలిపారు .యువతలో క్రమశిక్షణ, పట్టుదల , లక్ష్య సాధన పై దృష్టి ఉండాలని, జర్మన్ భాష నేర్చుకోవడానికి  ప్రతిరోజు సాధన చేయాలని సూచించారు. మందమర్రిలో ప్రారంభమైన ఈ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపేందుకు ప్రతివారం తాను స్వయంగా శిక్షణ కేంద్రాన్ని సందర్శించి అభ్యర్థులతో కలిసి జర్మనీ భాష నేర్చుకుంటానని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. అంతకుముందు క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జర్మన్ భాషా శిక్షణలో బి2 సర్టిఫికేషన్ పూర్తి చేసిన మరియన్ పాసల్, హుబా ఫాతిమా లకు ఆఫర్ లెటర్లు అందజేశారు.

మన దేశానికి ఏడాదికి 90 వేల వీసాలు ఇచ్చేందుకు జర్మనీ సిద్ధంగా ఉందనీ, జర్మనీ వీసా లో 50% సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. శిక్షణ కేంద్రంలో 4 నెలల్లో జర్మనీ భాష నేర్పిస్తారని చెప్పారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాలలో అవకాశాలకు భాషా పరిజ్ఞానం తప్పనిసరి అని ,జర్మనీలో పనిచేయాలనుకునే వారికి ఆ భాష ఒక శక్తివంతమైన సాధనం అని తెలిపారు..



8, జూన్ 2026, సోమవారం

ఉచిత జర్మనీ శిక్షణ తరగతులు

 యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు విస్తరించేదుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉచిత జర్మనీ భాష శిక్షణ క్యాంపును నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికా రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈనెల 10న ఉదయం మందమర్రిలోని సింగరేణి ఇల్లందు క్లబ్లో శిక్షణ తరగతులను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి తిధి వెంకటస్వామి ప్రారంభించనున్నట్లు చెప్పారు మంత్రి ఆదేశాలతో జర్మనీతో పాటు యూరోపియన్ దేశాల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన భాషా నైపుణ్యాలపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు విదేశీ ఉపాధి అవకాశాలపై ఆసక్తి కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

19, మే 2026, మంగళవారం

బధిరులకు ఉచితంగా

 బదిరులకు చదువుతోపాటు అన్ని రకాల నైపుణ్యాలను ఉచితంగా నేర్పించి తీర్చిదిద్దే సరస్వతి నిలయం నాగుబడి రంగయ్య అచ్చమ్మ బదిరుల పాఠశాల. బాపట్ల జిల్లా పర్చూరు మండలంలోని నాగులపాలెం గ్రామంలో ఉన్న ఈ పాఠశాలను ప్రవాసాంధ్రుడైన డా.నాగుబడి సుబ్బారావు గారు నిర్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన వైద్య విద్య చదివి అమెరికాలో యూరాలజిస్ట్ గా స్థిరపడ్డారు. ఆయన సోదరి బధిరురాలు . ఆమెలాంటి వారికి ఉపయోగపడేలా ఏదైనా చేయమని తండ్రి కోరడంతో 18 కోట్ల రూపాయలు హెచ్చించి ఈ పాఠశాలను స్థాపించారు.



అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వాళ్లకు విద్యతోపాటు వసతి ,పుస్తకాలు ,దుస్తులు ఇలా అన్నింటినీ అందిస్తుంది ఈ స్కూలు ట్రస్ట్.చదువుతో పాటు కుట్టుపని , సబ్బులు, చాక్ పీస్ ల తయారీని నేర్పిస్తూ ఆటలలోనూ ప్రోత్సహిస్తున్నారు..

18, మే 2026, సోమవారం

గిరిజన విద్యార్థులకు ఉచిత విద్య

 దాతృత్వంతోన ఆదర్శ సమాజ నిర్మాణం .. ఆర్బీ వి ఆర్ ఆర్ ఈ ఎస్ ఎస్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, జె ఎస్ ఎస్ఎన్ రెడ్డి.



అచ్యుత సమంత ప్రారంభించిన ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఉద్యమం 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది పంచుకోవడంలోనే ఆనందం అనే సందేశంతో మే 11 నుండి 17 వరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ కోఆర్డినేటర్ పి రాజా రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం అబిడ్స్ లోని రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నీని సొసైటీ సెక్రటరీ ప్రొఫెసర్ జి గోపాల్ జాయింట్ సెక్రటరీ ఎస్ఎన్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ వారోత్సవాలలో భాగంగా వాలీబాల్ కిట్ల పంపిణీ రక్తదాన శిబిరాలు పేద విద్యార్థులకు బోధనా సామాగ్రి అందజేత ఆహార పంపిణీ మొక్కలు నాటడం ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టారు యువతలో సేవాభావం నాయకత్వ లక్షణాలు క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు ప్రస్తుతం 200 కు పైగా దేశాలకు విస్తరించిన ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఉద్యమం దాతృత్వాన్ని జీవన విధానంగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది గిరిజన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ సమాజంలో సమానత్వం మానవత్వం పెంపొందించడంలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్ రెడ్డి జానకి రడ్డి తో పాటు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు 


వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...