5, ఆగస్టు 2026, బుధవారం

ఉచిత భోజనం@శ్రీ బాలాజీ ఫ్యామిలీ రెస్టారెంట్, సీలేరు

 ఇప్పుడిప్పుడే పట్టణంగా ఎదుగుతున్న ఏజెన్సీ ప్రాంతం.. సీలేరు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఈ ఊరిలో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు తూర్పు గోదావరి జిల్లా నుండి వచ్చింది నక్కా జ్ఞానేశ్వర రావు గారి కుటుంబం. మొదట్లో వ్యవసాయం చేసిన ఆయన, తర్వాత శ్రీ బాలాజీ ఫ్యామిలీ రెసిడెన్సీ అండ్ రెస్టారెంట్ ను పెట్టాడు. అప్పుడే అక్కడికి గర్భిణులు ఎక్కువగా రావడం గమనించాడు. వారందరూ మారుమూలన ఉన్న పర్వత ప్రాంతాల నుంచి సీలేరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వచ్చే గిరిజనులు. ఐతే వారి దగ్గర భోజనానికి సరిపడా డబ్బు ఉండేది కాదు. తమ దగ్గర ఉన్నదేదో చేతిలో పెట్టి వెళ్ళి పోయే వారు. ఆయన కూడా ఇంతే ఇవ్వాలి అని పట్టు పట్టేవారు కాదు. పోనుపోను వారిని డబ్బులు అడగడమే మానేశాడు జ్ఞానేశ్వర రావు. అలా 2018 నుండి వారికి ఉచితంగానే భోజనం పెడుతున్నాడు ఆయన. 

కేవలం తన హోటల్ ను వెతుక్కుంటూ వచ్చే వారికి మాత్రమే కాకుండా , సీలేరు పీ హెచ్ సీ లో పని చేసే నర్సులకు రోజూ తన హోటల్ మీల్స్ టోకెన్లు ఇస్తున్నాడు. వారు దవాఖానకు వచ్చే గర్భిణులకు , వారి సహాయకులకు ఈ టోకెన్లు ఇచ్చి హోటల్ కు పంపిస్తున్నారు. అలా రోజూ కనీసం 20 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నాడు శ్రీ జ్ఞానేశ్వర రావు. 

ఇక్కడ ప్రతి నెలా 9 వ తేదీన గర్భిణులకు అన్ని రకాల టెస్టులు చేస్తుంటారు. ఆ సమయంలో వంద మంది కి పైగా వస్తుంటారు. ఆ రోజున తన భార్య నాగమణితో కలిసి హోటల్ నుండి తానే స్వయంగా భోజనం తీసుకెళ్లి ఇస్తుంటాడు ఆయన. 

ఉచిత విద్య@విద్యాఛాయ పాఠశాల@ సిలిగురి

 పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి పట్టణానికి చెందిన శక్తిపాల్ ది నిరుపేద కుటుంబం. అన్నం దొరకడమే కష్టమైన పరిస్థితుల్లో బాల కార్మికుడిగా మారాడు ఆయన. తర్వాత ఎంతో శ్రమించి సైన్యంలో చేరాడు. ప్రస్తుతం అస్సాం రైఫిల్స్ లో హవల్దార్ గా పని చేస్తున్నారు శ్రీ శక్తిపాల్. తన చిన్నప్పటి ఆకలి బాధలను మరచిపోలేదు శక్తిపాల్. తనకొచ్చే జీతంలో సగాన్ని వెచ్చించి రూ. 1 జనతా హోటల్ అనే పేరుతో సిలిగురిలో ఒక హోటల్ స్థాపించారు. 

ఇక్కడున్న ప్రభుత్వ ఆఫీసులకు,ఆసుపత్రులకు,ప్రయాణికులకు కడుపునిండా భోజనం పెడుతున్నాడు. మరి ఆ ఒక్క రూపాయి ఎందుకు అంటే..నేను నడిపే బడిలో వారిని ఏదో రకంగా భాగస్వాములను చేయాలి కదా అంటాడు.

విద్యా ఛాయ పేరుతో సిలిగురిలో ఒక పాఠశాలను నడుపుతున్నారు శక్తి పాల్ గారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే పేద వలస కార్మికుల పిల్లల సంక్షేమమే లక్ష్యంగా నడిచే ఈ బడిలో " ఉచితంగా చదువు " చెప్పడమే కాదు, రెండు పూటలా భోజనం పెడుతున్నాడు,ఉచితంగా బట్టలు,పుస్తకాలు అందిస్తున్నాడు శక్తి పాల్.ఇందుకోసం తన సంపాదనలో సగానికి పైగా వెచ్చిస్తున్నారు శక్తి పాల్..


బాలికలకు ఉచిత పైలట్ శిక్షణ

 తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు ఉచితంగా పైలట్ శిక్షణ ఇచ్చేందుకు ఇండిగో సంస్థ సీ ఎస్ ఆర్ విభాగం ఇండిగో రీచ్, ఇంటర్ విద్యా శాఖ ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఇంటర్ విద్యా శాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్, భారత్ కేర్స్ ట్రస్ట్ ప్రతినిధి సి. సాయి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇండిగో రీచ్, భారత్ కేర్స్ సంస్థ లతో కలిసి అమలు చేస్తున్న " గివింగ్ వింగ్స్ టు ఫ్లై కార్యక్రమం " ద్వారా పైలట్ శిక్షణ ఇస్తారు. 20 నెలల పాటు కొనసాగే శిక్షణా కాలంలో కమర్షియల్ పైలట్ లైసెన్స్, ట్రైనింగ్ విత్ ఏ టీ ఆర్ టైప్ రేటింగ్, బస, భోజన వసతి, వైద్య బీమా, మెంటార్ షిప్, కెరీర్ మార్గదర్శక ఖర్చులను పూర్తిగా ఆయా సంస్థలే భరిస్తాయి. 

ఈ ఒప్పందంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అమ్మాయిలు తమ పైలట్ కావాలన్న కలను నిజం చేసుకోవచ్చని అభిలాష అభినవ్ అన్నారు.కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, వెబినార్లు నిర్వహిస్తారని తెలిపారు. అర్హులైన విద్యార్థినులు అధికారిక పోర్టల్ indigoreachgwf.scholarsbox.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఇంటర్ కళాశాలల నెట్వర్క్ ద్వారా ఈ సమాచారాన్ని విద్యార్థినులకు చేరువ చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

4, ఆగస్టు 2026, మంగళవారం

ఉచిత అన్న ప్రసాదం@ కడప కలెక్టరేట్

 అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసులలో జరిగినట్లుగానే కడప కలెక్టరేట్ లో కూడా ప్రతి సోమ వారం గ్రీవెన్స్ డే జరుగుతుంది. చుట్టు పక్కల ఊర్ల నుండి వందలాది మంది ప్రజలు వినతి పత్రాలు తీసుకుని వస్తుంటారు. పెన్షన్ దరఖాస్తుల కోసం, ఇతర సహాయాల కోసం, అర్జీలు పెట్టుకుని అధికారుల వంక ఆశగా చూస్తుంటారు. అందుకే దానిని అధికారికంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పిలుస్తుంటారు. అక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో తెలియదు కానీ వచ్చిన వారి ఆకలి మాత్రం తీరుతుంది. అలా అర్జీలు పట్టుకుని అక్కడికి వచ్చే వారందరికీ కడుపు నిండా భోజనం పెడుతున్నారు శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. గత 12 సంవత్సరాల నుంచి ఒక యజ్ఞం లా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు ఈ ఉచిత అన్నదానాన్ని శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. రాయల సీమ లో తొలి ప్రైవేటు న్యాయ కళాశాలను స్థాపించిన వ్యక్తి ఆయన. 

1986 లో నాటి ముఖ్య మంత్రి శ్రీ ఎన్టీరామారావు గారి మీద అభిమానంతో బసవరామ తారకం న్యాయ కళాశాల అని పేరు పెట్టారు ఆయన. 2015 లో గోవర్ధన్ రెడ్డి గారు కడప కలెక్టరేట్ కు పని మీద వచ్చినప్పుడు , అర్జీలు పట్టుకుని మధ్యాహ్నం వరకు అధికారుల కోసం పడిగాపులు కాస్తూ ఆకలితో అలమటిస్తున్న ప్రజలను చూసారట ఆయన. ఈ దుస్థితిని తొలగించాలని నాటి నుంచి ఈ అన్న యజ్ఞాన్ని ప్రారంభించారు. దీని కోసం నెలకు దాదాపు 50 వేల రూపాయలు వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

పోలీసు అధికారిగా పనిచేసిన తన తండ్రి ,తల్లితో కలిసి ప్రతి రోజూ కొంత మంది పేదవారికి   ఇంటి వద్ద అన్నం పెట్టేవారని , నేను దానిని కొనసాగిస్తున్నాను, అంతే అంటారు వినమ్రంగా శ్రీ సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు. 

విద్యార్థినులకు ఉచిత ఆటో ప్రయాణం

 ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు ఉచిత ప్రయాణం అని రాసి ఉన్న గులాబీ రంగు ఆటో చెన్నై లో అందరినీ ఆకర్షిస్తుంటుంది. చెన్నై లోని టీ నగర్, కోడంబాక్కం, అన్నా నగర్, పెరంబూర్ ప్రాంతాలలో గత కొన్ని సంవత్సరాలుగా తన ఆటోలో ఉచితంగా అమ్మాయిలను తీసుకు వెళుతోంది " రాజీ అశోక్" 




54 ఏళ్ల రాజీ అశోక్ ఆర్థిక సమస్యల కారణంగా కాలేజీ చదువును అర్ధాంతరంగా మానివేసింది. తన చదువు కొనసాగి ఉంటే జీవితం బాగుండేదని అనుకుంటూ ఉంటుంది. తనలాగే ఇతరులు చదువు మధ్యలో మానేయకుండా ఉండాలని తన వంతు సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రాజీ అశోక్. 

ప్రతి రోజూ విద్యార్థినులను బడిలో దింపి సాయంత్రం తిరిగి తీసుకు వస్తుంది రాజీ. రోజూ 10 నుంచి 15 మంది బాలికలకు సహాయం చేస్తుంది. ఇలా చేయడం అంటే తన సంపాదనలో ఎంతో కొంత వదులుకోవడమే. ఐతే అదేమీ తనకు ఇబ్బందిగా లేదు. స్కూల్, బస్ స్టాప్, ఆటో స్టాండ్ దగ్గర పిల్లల కోసం వేచి చూస్తాను. గులాబీ రంగు ఆటో ను గుర్తు పట్టి వెంటనే ఎక్కేసారు. నన్ను చూడగానే వారికి సంతోషంగా ఉంటుంది. సౌకర్యంగా కూర్చుంటారు. ఆకలి వేస్తే తినడానికి ఆటోలో బిస్కట్ ప్యాకెట్లు ఎప్పుడూ ఉంటాయి అంటుంది రాజీ అశోక్. 


ఎప్పుడో ఎక్కిన పిల్లలు సంతోషంగా పలకరించడం,వారి  తల్లిదండ్రులు ఆప్యాయంగా పలకరిస్తుంటే వెయ్యి ఏనుగుల బలం వస్తుంది, అంతులేని ఉత్సాహం వస్తుంది, ఇంకా ఏదైనా చేయాలని అనిపిస్తుంది అంటుంది రాజీ.

నేను రాజీ అక్క ఆటోలో ప్రయాణించాను అని ఎంతో మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు, వాటికి ప్రశంసలూ వస్తుంటాయి.. అవి నాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంటాయి అన్నారు రాజీ.. 

వయసు 54 ఏళ్ళు కావడంతో స్వస్థలానికి తిరిగి వెళ్ళాలనిపించి ఇంటికి వెళ్ళిపోయారు రాజీ.మనసు మాత్రం చెన్నై ని వదలలేదు.. మళ్ళీ చెన్నై వచ్చేశారు. రాజీ భర్త ఒక సంస్థ ఇచ్చిన అంబులెన్స్ తో కేరళలో ఉచితంగా సేవ చేస్తుండడం, రాజీ కూడా చెన్నైలో తన వంతు సేవ చేస్తుండడం మనసుకేంతో ఆనందంగా ఉందంటారు రాజీ. చిన్న పాటి ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతుంటారు రాజీ. ఒక పెద్ద ఆటో ఉంటే మరింత మంది కి సేవ చేయగలుగుతాను అంటారు రాజీ. 


3, ఆగస్టు 2026, సోమవారం

జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ లో ఉచిత విద్య

 అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో వంద శాతం ఉచిత విద్య అందించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వంచరెడ్డి శ్రీకాంత్, వ్యాగ్మారే సుభాష్ లు కోరారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ ను కలిసి వినతి పత్రం అందచేశారు. జిల్లా సందర్శనకు వచ్చిన విద్యా శాఖ కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా గారిని ప్రెస్ క్లబ్ కార్యవర్గం కలిసి ఉచిత విద్య అందించాలని వినతి పత్రం అందచేశారు. ప్రైవేట్ , కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య కోసం తగు చర్యలు తీసుకోవాలని ఆమె డీఈఓ గారికి ఆదేశాలు జారీ చేశారు. డీఈఓ గారు స్పందిస్తూ ఇతర జిల్లాల్లో ని ప్రొసీడింగ్స్ పరిశీలించి నిజామాబాద్ జిల్లాలో కూడా ఉచిత విద్య అందించేలా త్వరలో చర్యలు చేపడతామని తెలిపారు. 

అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ లలో ఉచిత ప్రవేశం

 దేశంలో వృత్తిపరమైన శిక్షణ లో నాణ్యతను, ప్రయోజనాలను విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ ఫర్మేషన్ త్రూ ఐ టీ ఐ స్.. పీఎం సేతు పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకానికి సంబంధించి సంగారెడ్డి క్లస్టర్ లో ఎల్లారెడ్డి ఏ టీ సీ ను ఎంపిక చేశారు. దీని ద్వారా ఈ కేంద్రంలో అత్యాధునిక యంత్రాలు, ఆటోమేషన్ పరికరాలు , డిజిటల్ ల్యాబ్ లు, ఆధునిక కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ దేశ వ్యాప్తంగా 1000 ఏ టీ సీ లను ఆధునీకరించనున్నది.

సంగారెడ్డి క్లస్టర్ లో ఎల్లారెడ్డి తో పాటు మెదక్, దుబ్బాక, హత్నూర్ ఏ టీ సీ లు ఉన్నాయి. వీటిని స్పోక్ ఏ టీ సీ లు గా అప్ గ్రేడ్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం, న్యూ ల్యాండ్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళుతోంది.

ఉచిత ప్రవేశం..

విద్యార్థులు ఈ కోర్సుల లో ప్రవేశం పొందేందుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. శిక్షణా కాలంలో ప్రభుత్వం రూ.2 వేల చొప్పున స్టైఫండ్ లేదా స్కాలర్ షిప్ ఇస్తుంది. కోర్స్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి క్యాంపస్ సెలెక్షన్ ద్వారా పలు కార్పొరేట్ సంస్థల లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వంద శాతం ప్లేస్ మెంట్ సహాయం లభిస్తుందని భావిస్తున్నారు. ఆసక్తి గల వారు టీ జి ఐ టీ ఐ అడ్మిషన్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైద్రాబాద్ వంటి నగరాలకు వెళ్ళనవసరం లేకుండా సొంత జిల్లాలోనే ప్రపంచ స్థాయి నైపుణ్యాలను ఈ స్పోక్ ఏ టీ సీ ద్వారా ఉచితంగా పొంది మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు మెరుగవుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...