హైదరాబాదులోని పంజాగుట్ట లో గల నిమ్స్ ఆసుపత్రిలో మార్చి 31వ తేదీన వయోవృద్ధులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు నిమ్స్ వైద్య సిబ్బంది తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ హెల్త్ మిషన్ 100 కార్యక్రమంలో భాగంగా నిమ్స్ వైద్యశాల యొక్క జీర్యాట్రిక్ మెడిసిన్ మరియు అడ్మినిస్ట్రేటివ్ విభాగాల ఆధ్వర్యంలో ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు.
వృద్ధుల్లో తలెత్తే శారీరక మానసిక సమస్యలను ముందుగానే గుర్తించి తగు చికిత్స అందించడం ఈ శిబిరం యొక్క ప్రధాన ఉద్దేశం అని బీరప్ప తెలిపారు.
వృద్ధులకు అవసరమైన కీలక పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు.ఇందులో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రాండమ్ బ్లడ్ షుగర్,సీరం క్రియాటినిన్ వంటి పరీక్షలుంటాయన్నారు.. ఫిజియోథెరపీ అవసరం ఉన్నవారికి సేవలు అందిస్తారని,మానసిక ప్రశాంతత కోసం ఉచిత ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు.
వృద్ధాప్యంలో వచ్చే సాధారణ సమస్యల గురించి అవగాహన కల్పించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.60 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఆసక్తి గల వారు నిమ్స్ ఆసుపత్రిలో పాత బ్లాక్ లో గల నెఫ్రాలజీ సెమినార్ హాల్ ( గ్రౌండ్ ఫ్లోర్ )లో మార్చి 31వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
శిబిరానికి వచ్చే వారు తప్పకుండా తమ ఆధార్ కార్డును తీసుకుని రావాలని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
No comments:
Post a Comment