దోమకొండ గ్రామంలో బీడీ కార్మికులు, కూలీలు ఎక్కువగా ఉండడంతో వారి కుటుంబాలలో మెరుగైన ఆర్థిక పరిస్థితులు లేవు. అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని వైద్యులకు చూపించలేని పరిస్థితిలో పలు కుటుంబాలు ఉండేవి. ఈ నేపథ్యంలో నిరుపేదలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో దోమకొండ గడికోట ట్రస్ట్, గ్రామ అభివృద్ధి సంస్థ కలిసి ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాయి. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనిమిదేళ్లుగా ఈ ఉచిత వైద్య సేవలు నిరంతరాయంగా అందుతున్నాయి.
ట్రస్ట్ ఆధ్వర్యంలో 2017 లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అధిక సంఖ్యలో బాధితులు శిబిరానికి వచ్చారు. చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో పాటు బీపీ, షుగర్ వంటి వాటితో బాధ పడుతూ వైద్య పరీక్షలకు వెళ్లలేని దుస్థితిని ట్రస్ట్ ప్రతినిధులు గ్రహించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులను సర్వే నిర్వహించి గుర్తించారు. నిరుపేదలైన రోగులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, మందులు అందించాలని ట్రస్ట్ వారు సేవలందించడానికి పూనుకున్నారు.
జూలై 18,2018 నుంచి ప్రతి నెలా రోగులకు వైద్యులచే పరీక్షలు చేయిస్తూ, మందులను అందిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా ఈ సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. డయాబెటిస్ తో బాధ పడుతున్న ముగ్గురు విద్యార్థులకు సైతం ప్రతి నెలా సరిపోవు ఇంజక్షన్లు, మందులను అందిస్తూ వారి చదువులకు ఊతమిస్తున్నారు.
అపోలో ఆసుపత్రి వారి సహకారంతో ఈ ఉచిత వైద్య సేవలు అందించడం , నిరుపేద కుటుంబాల్లో ఆత్మీయత,సంతోషం నెలకొనడం ఎంతో తృప్తిని ఇస్తుందని దోమకొండ గడికోట ట్రస్ట్ సీనియర్ మేనేజర్ బాబ్జీ గారు పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి