13, సెప్టెంబర్ 2026, ఆదివారం

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వాళ్ళకీ దూరంగా ఉన్నామన్న బాధని పోగొట్టుకోవడానికి నెలనెలా సంగీత కచేరీలు ఏర్పాటు చేసేవాడు. 2003 లో కర్ణాటక పశ్చిమ కోస్తాలోని కర్కల గ్రామంలో .. తుఫానుకి ఓ బడి కూలిపోవడం .. అక్కడి ప్రధానోపాధ్యాయుడు తమకు సాయం చేయమని అడగడం .. అతన్ని ఆలోచనలో పడేసింది. నేను మాత్రమే కాదు సిలికాన్ వ్యాలీకి వచ్చిన నాలాంటి తొలి తరం ఐటీ నిపుణులందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారమే.. అవి ఇలా కుప్ప కూలిపోతున్న దైన్యం మా గుండెల్ని పిండేసింది. అలా నా మిత్రులతో కలిసి కర్కలలోని బడిని పాతిక లక్షల రూపాయలతో బాగు చేసి ఇచ్చాం. అప్పటి నుంచి ఏటా ఒక పాఠశాలను బాగు చేయాలన్న లక్ష్యంతోనే నేనూ నా మిత్రులం 40 మందిమి కలిసి " ఒన్ స్కూల్ ఎట్ ఏ టైం " ( ఓ శాట్ ) ను స్థాపించాము.. అని గుర్తు చేసుకుంటాడు భట్. ఏడాదికి ఒక్క స్కూల్ నే బాగు చేయాలనుకుని మొదలైన సంస్థ ఇప్పుడు ఏటా 30 బడుల్ని తీర్చి దిద్దుతోంది. ఇప్పటిదాకా 150 బడుల్ని బాగు చేసింది. 

ఇలా పని చేస్తుంది..

ఈ మధ్య తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని ముత్తంగి గ్రామంలో ఓ జడ్పీ స్కూలును తీర్చి దిద్దేందుకోసం భూమి పూజ నిర్వహించింది ఓ శాట్ సంస్థ. అది జరుగుతున్న చోటకే క్వాల్కం కంపెనీలో ఓ ఐటీ నిపుణుడు వచ్చాడట . వచ్చీ రాగానే 10 లక్షల రూపాయలకు చెక్ ఇచ్చి .. ఈ పనులకి నా విరాళంగా ఉంచండి.. అని చెప్పాడట. తన పేరు ఎక్కడా బయటకు రాకూడదనీ చెప్పి వెళ్ళాడట. ఓ శాట్ సంస్థ పైన దాతలకు ఉన్న నమ్మకానికి ఇదో ఉదాహరణ. ఇలా ప్రతి ప్రాజెక్టుకి సాయపడే సాంకేతిక నిపుణులూ,ఎన్నారైల సాయంతోనే ఈ సంస్థ ఎన్నో గ్రామీణ బడుల్ని పునరుద్ధరిస్తోంది. ఆ సరస్వతి నిలయాలను ఎంతో మంది అజ్ఞాత దాతల నిస్వార్థ గుణానికీ, సేవా తత్పరతకు సాక్ష్యంగా నిలుపుతుంది.

12, సెప్టెంబర్ 2026, శనివారం

తెలుగు రాష్ట్రాల్లో సీ ఆర్ ఫౌండేషన్ సేవలు

 కొండాపూర్ సిఆర్ ఫౌండేషన్ లో నూతన కార్యవర్గం సభ్యులతో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు కే నారాయణ మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాశ్రమాలు విస్తరిస్తామని తెలిపారు. కడప ,గుంటూరు ప్రాంతాల్లో భవనాలు, భూములు, విరాళంగా లభించాయని అక్కడ వృద్ధాశ్రమాలు నిర్మించే ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. కడపలోని వృద్ధాశ్రమం ఇప్పటికే ప్రారంభమైందని అలాగే అమరావతిలో ఏపీ ప్రభుత్వం మూడు ఎకరాల భూమిని కేటాయించడానికి అంగీకరించిందని స్థలం ఖరారు కావాల్సిందని వెల్లడించారు. 

సి ఆర్ పాలి క్లినిక్ గ్రామీణ ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరేలా టెలి మెడిసిన్ ద్వారా సేవలను విస్తరించాలని, పేదలు, అవసరమైన వారి కోసం డయాలసస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని  యోచిస్తోందన్నారు. ఎన్ ఆర్ ఆర్ రీసెర్చ్ సెంటర్ ద్వారా పాఠశాల పిల్లల కోసం నెలవారీ కార్యకలాపాలు నిర్వహించడంతోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించినట్లు నారాయణ వివరించారు. సిఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో 22 ఏళ్లుగా ఉంటున్న సుబ్బలక్ష్మి తన మరణానంతరం ఫౌండేషన్కు 25 లక్షల రూపాయల విరాలం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సిఆర్ ఫౌండేషన్ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, కే రజని ,పిడికిటి సంధ్య కుమారి, ప్రధాన కార్యదర్శిగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు, కార్యదర్శులుగా కంభంపాటి అజయ్ కుమార్, మహమ్మద్ యూసఫ్, ఏ రామానాయుడు, బి చెన్నకేశవరావు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా 25 మందిని నియమించారు. 

ఉచితంగా.. నిపుణుల సలహా..

 ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకూ స్త్రీ పురుష భేదం లేకుండా ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలలో ఒత్తిళ్లకు లోనవుతూ జీవిస్తున్నారు. తీవ్ర నిరాశ, ఆందోళనలకు గురవుతున్నారు. పర్యవసానంగా ఆత్మహత్య ఆలోచనలు చేస్తూ, క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. 

ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నపుడు మనం చేయాల్సింది నిపుణుల సలహా తీసుకోవడమే.అదృష్టవశాత్తూ మనకు సహృదయులైన నిపుణులు ,ప్రభుత్వ వర్గాలు ఉచితంగా సలహా,మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ఆ వివరాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ,నలుగురికి తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వివరాలు..

మీకు గానీ, మీకు తెలిసిన వారు గానీ తీవ్ర మానసిక ఒత్తిడి తో బాధపడుతుంటే , ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే , సాయం కోసం వెంటనే.. 

ప్రభుత్వ హెల్ప్ లైన్..1800-599-009,

టెలీ మానస్..14416,

రోషిణి ట్రస్ట్ .. 040-66202000,

వన్ లైఫ్ హెల్ప్ లైన్..7893078930,

నంబర్లలో సంప్రదించ వచ్చు. నిపుణుల సలహా ఉచితంగా లభిస్తుంది.

11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

ఉచిత వైద్యం@ అరుంధతి హాస్పిటల్.

 గండి మైసమ్మ , దుండిగల్ దారిలో ఉన్న అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ లో కేవలం టెస్టులే కాదు, రూపాయి ఖర్చు లేకుండా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తారు. 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 2023 లో ఈ హాస్పిటల్ ఏర్పాటైంది. ఖరీదైన సర్జరీలు ఉచితంగా చేస్తూ , రోగులకు రాయితీపై మందులు ఇస్తున్నారు. 

మల్కాజ్ గిరి MLA డా. మర్రి రాజశేఖర్ రెడ్డి తన తల్లి అరుంధతి పేరు మీద మర్రి రాజశేఖర్ ఫౌండేషన్ ద్వారా ఈ ఆసుపత్రి ని స్థాపించారు. NABH గుర్తింపు 350 కి పైగా బెడ్ లు సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో ఉచిత OPD తో పాటు రోగులకు ఉచితంగా బెడ్ లు మూడు పూటలా ఉచిత పోషకాహార భోజనం అందిస్తున్నారు. 

వీటితో పాటు ఎక్స్ రే, 24/7 సీటీ స్కాన్, ECG, అల్ట్రా సౌండ్ , రక్తం, మూత్ర పరీక్షలు వంటివన్నీ పూర్తిగా ఉచితంగా చేస్తారు. మేజర్ సర్జరీలు కూడా ఉచితంగా చేస్తారు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల కోసం ఉచిత బస్సులు కూడా నడుపుతున్నారు. ఈ ప్రాంగణంలోనే మెడికల్ కాలేజీ కూడా నడుస్తుంది. 

మరిన్ని సమగ్ర వివరాలకు 8055667888 హెల్ప్ లైన్ లో సంప్రదించ వచ్చు. 

ఆర్ వీ ఎం చారిటబుల్ హాస్పిటల్

 సికింద్రాబాద్ నుండి సిద్దిపేట వెళ్ళే దారిలో , 

రాజీవ్ రహదారి,

శామీర్ పేట్ దాటిన తర్వాత,

వంటిమామిడి విలేజ్ ,

నుండి లక్ష్మక్క పల్లి గ్రామం దగ్గర ఈ హాస్పిటల్ ఉంది.దాదాపు ప్రతీ రోజూ 1200 నుండి 1500 వరకు రోగులు వస్తుంటారు. అన్ని రకాల చికిత్సలు ఉచితంగా చేస్తారు. ఉచిత భోజనం ఉంటుంది. సీఈఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, డా యాకయ్య గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడుస్తుంది అని తెలిపారు. 

6, సెప్టెంబర్ 2026, ఆదివారం

డా రమేశ్ టెండూల్కర్ మెమోరియల్ ఫెలోషిప్

 యువర్ డాక్టర్లకు అండగా నిలవాలని క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నిర్ణయించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా యువ డాక్టర్లకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు .తన తండ్రి దివంగత ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ జ్ఞాపకార్థము" ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ మెమోరియల్ ఫెలోషిప్"  ను ప్రారంభించారు. దీని ద్వారా వైద్య రంగంలో పై చదువులు చదవాలనుకునే యువ వైద్యులకు సచిన్ టెండూల్కర్ ఆర్థిక సహాయం అందించనున్నారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ మరియు హెల్త్ కేర్ సంస్థ అయిన ఇంగా హెల్త్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో దీనిని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఒక ఎండి చేసిన యువ డాక్టర్కు ఈ ఫెలోషిప్ కింద ఆర్థిక సహాయం లభిస్తుంది.

 ఎంపికైన వైద్యుడికి శ్రీనగర్లో క్లెఫ్ట్ అండ్ క్రానియోఫేషియల్ విభాగంలో ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ పొందే అవకాశం కల్పిస్తారు. ఈ ప్రోగ్రాం విజయవంతంగా పూర్తి చేసిన వారికి సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ నుంచి సర్టిఫికెట్ అందజేస్తారు. ఇది కేవలం ఒక ఫెలోషిప్ మాత్రమే కాదని, విద్యా అవకాశాలను సృష్టిస్తుందని ఆ అవకాశం ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగపడినప్పుడే దానికి నిజమైన అర్థం ఉంటుందని నాన్న బలంగా నమ్మేవారని సచిన్ చెప్పుకొచ్చారు. ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకే ఈ ప్రయత్నం అని తెలిపారు .ఈ సదుపాయం ద్వారా క్లిష్టమైన వైద్య విభాగాలలో యువ డాక్టర్లను ప్రోత్సహించడంతోపాటు, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలోని పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి అని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 




5, సెప్టెంబర్ 2026, శనివారం

ఎయిర్ టెల్ కస్టమర్లకు.. సూపర్ డ్యూలింగో ఫ్రీ

 లాంగ్వేజ్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ డ్యూలింగో 37.6 కోట్ల మంది ఎయిర్ టెల్ కస్టమర్లకు ఏడాదిపాటు తమ సేవలను ఉచితంగా ఇస్తామని తెలిపారు. మొబైల్, వైఫై, DTH వినియోగదారులు ఎయిర్ టెల్ యాప్ ద్వారా ఈ ప్రీమియం ఫీచర్ ను ఉచితంగా పొందవచ్చు. 

యాప్ ద్వారా ఏ ఐ ఆధారిత రియల్ టైమ్ స్పీకింగ్ ప్రాక్టీస్ ,అడ్వాన్స్డ్ లెర్నింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. హిందీ, బెంగాలీ, తెలుగు , తమిళం, ఉర్దూ తో పాటు తాజాగా పంజాబీ నుంచి ఇంగ్లీష్ నేర్చుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చారు. 40 కి పైగా భాషలతో పాటు మ్యాథ్స్, మ్యూజిక్, చెస్ నేర్చుకునేందుకు డ్యూలింగో ఉపయోగపడుతుంది. 

28, ఆగస్టు 2026, శుక్రవారం

ఉచిత డిజిటల్ కంటెంట్@టీ - శాట్

 విద్య అనేది ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు ఒక కుటుంబం భవిష్యత్తును, సమాజం యొక్క అభివృద్ధిని మార్చ గలిగే శక్తి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తే వారి జీవితాలలో ఒక మంచి మార్పు అనేది వస్తుంది. ఈ ఆలోచనతోనే తెలంగాణలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విద్యాసంస్థలలో మౌలిక వసతులు మెరుగు పరచడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు వినూత్నమైన చర్యలు చేపడుతుంది. ఈ ప్రయత్నాలకు సాంకేతికని జోడిస్తూ టీ శాట్ చేస్తున్న కృషి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది .విద్యార్థి పునాదులు పాఠశాల స్థాయి నుండే బలోపేతం కావాలని లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతుంది. అదే బాటలో పయనిస్తూ ఇటీవల టీ శాట్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ తో ప్రసారాలపై ఎం ఓ యు  కుదుర్చుకున్నది.

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి కూడా ప్రైవేట్ విద్యా సంస్థలో చదివే విద్యార్థితో సమానమైన నాణ్యమైన విద్య  అందాలన్నదే ప్రభుత్వ విద్య వ్యవస్థ లక్ష్యం కావాలనే మనం కోరుకుంటాం. అయితే తరగతి గదిలో మంచి బోధనతో పాటు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, మోడల్ పరీక్షలు, ప్రాక్టీస్ టెస్టులు, కెరీర్ మార్గదర్శకత్వం కూడా అవసరపడుతుంది. ఈ అవసరాన్ని గుర్తించి తమ కార్యక్రమాలను క్రమంగా విస్తరిస్తున్న టీ శాట్ ఇటీవల నిర్వహించిన ఎప్ సెట్ డిజిటల్ కోర్స్  ఇందుకు మంచి ఉదాహరణ. ఇందులో భాగంగా 112 రోజుల పాటు 450 అకాడమిక్ మాడ్యూల్స్ ను ప్రసారం చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ,బోటనీ, జువాలజీ లాంటి ప్రధాన సబ్జెక్టులపై నిపుణులతో డిజిటల్ పాఠాలను అందించింది. టీవీ ప్రసారంతో పాటు డిజిటల్ వేదికల ద్వారా కూడా విద్యార్థులకు ఈ ఉచిత డిజిటల్ కంటెంట్ అందుబాటులో  ఉండేలా చర్యలు తీసుకుంది. ఇక్కడ టీ శాట్ ప్రత్యేకత కేవలం పాఠాలు చెప్పడం  లోనే లేదు, విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యే విధంగా మోడల్ పరీక్షలు, ప్రాక్టీస్ ప్రశ్నలు, సబ్జెక్టు వారీగా పరీక్షా సన్నద్ధత, పరీక్ష విధానం పై అవగాహన వంటి అంశాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రవేశ పరీక్షలకు  సన్నద్ధం అయ్యేందుకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని విద్యార్థులకు ఇలాంటి" ఉచిత డిజిటల్ కంటెంట్ " ఎంతో ఉపయోగకరం. ఎప్ సెట్ తో పాటు జేఈఈ మెయిన్స్, పాలిసెట్, గురుకుల సెట్, పీజీ సెట్, గ్రూప్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్ బి,పోలీసు ఉద్యోగాలు, డీఎస్సీ, టెట్ వంటి వివిధ పోటీ పరీక్షలకు కూడా టీ శాట్ ప్రత్యేక కార్యక్రమాలను ఉచితంగా అందిస్తుంది.

ఆగస్టు 22న పాఠశాల విద్యా డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ టీ శాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి మధ్య కుదిరిన ఒప్పందం పాఠశాల విద్య వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ ఒప్పందం ద్వారా 9, 10 తరగతుల విద్యార్థులకు సాయంత్రం వేళల్లో డిజిటల్ పాఠాలను టీ శాట్ ద్వారా ప్రసారం చేయనుండడంతో పాఠశాలల ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పునఃశ్చరణ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు రాష్ట్రంలోని సుమారు 28 వేల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాలు ,మా జిల్లా మా పాఠశాల, ఉపాధ్యాయుల కోసం నిర్వహించే టిఎల్ఎం మేళాలు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలు కూడా టీ శాట్ లో ప్రసారమవుతాయి. టీ శాట్ వివిధ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థలు, విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడం ప్రభుత్వ విద్య బలోపేతానికి సానుకూలంగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.ఇటీవల మహాత్మా గాంధీ యూనివర్సిటీ తో కుదిరిన ఎం ఓ యు  తో ఆన్లైన్ లో విద్యా అవకాశాలను విస్తరించడానికి చర్యలు చేపట్టారు. టీ శాట్ పేద విద్యార్థికి "ఉచిత డిజిటల్ కోచింగ్ సెంటర్". గ్రామీణ విద్యార్థికి "నాణ్యమైన విద్యా వేదిక". పోటీ పరీక్షల అభ్యర్థికి "మార్గదర్శి" .ప్రభుత్వ విద్య కోసం "సాంకేతిక బలం"  అని చెప్పవచ్చు. 

25, ఆగస్టు 2026, మంగళవారం

రూ 1 కే.. ఫంక్షన్ హాల్..

 పేదలు, మధ్య తరగతి వర్గాల వారు శుభ కార్యాలు చేసుకోవడానికి రూపాయికే ఫంక్షన్ హాల్/ వేడుక వేదిక ను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అంటే ప్రజలు దాదాపుగా ఉచితంగానే ఈ సౌకర్యం పొందుతారు అని చెప్పవచ్చు. 

ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఫంక్షన్ హాల్ ను ఆగస్టు 16 న మంత్రి నారాయణ గారు ప్రారంభించారు. అప్పుడే దీనిని ఒక రూపాయికి అద్దెకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. హాలు మొత్తం సెంట్రల్ ఏసీ, టైల్స్ తో కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు. దీని సామర్థ్యం 5 వేలు కాగా, పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. ఎన్ క్యాప్ నిధులు రూ.25 లక్షలు, కార్పొరేషన్ కు చెందిన రూ.1.15 కోట్లు ఖర్చు చేశారు.

బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ @ తమిళనాడు

 తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీ వేదికగా సోమవారం నాడు పలు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి" ఏడాదికి మూడు ఉచిత ఎల్పిజి సిలిండర్లు " అందించనున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ సూపర్ సిక్స్ పథకం కింద దీనిని అమలు చేస్తామని చెప్పారు .లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు నేరుగా జమ అయ్యేలా పథకాన్ని అమలు చేస్తామని ,వచ్చే ఏడాది పొంగల్ నుంచి ఈ పథకం అమలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద ఒక కోటి 30 లక్షల కుటుంబాలకు లాభం చేకూరనున్నది.

 మహిళలు, ట్రాన్స్ జెండర్ ల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత విస్తరిస్తూ " వెట్రి పయన తిట్టం"  పథకాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఈ పథకం ద్వారా ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించడంతో పాటు మహిళల కోసం దీని పరిధిని విస్తరించారు. ఇకపై ఎక్స్ప్రెస్ ,లిమిటెడ్ స్టాప్ సర్వీస్, డీలక్స్ బస్సులు, సబర్బన్, కొండ ప్రాంతాలలో నడిచే సాధారణ చార్జీల బస్సులోను మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రయాణం సాగించవచ్చు. ఈ పథకానికి ఎలాంటి ఆదాయ పరిమితి ,ప్రయాణాల సంఖ్య పై నిబంధనలు ఏమీ ఉండవని సీఎం స్పష్టం చేశారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నదని తెలిపారు. 

ఉచిత శిక్షణ కోర్సులు@ నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచితంగా వివిధ కోర్సులలో శిక్షణ అందించి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆకుల మంజుల ఆకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు . దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

శిక్షణ అందించే రంగాలు..

 హెల్త్ కేర్  సెక్టార్, కంప్యూటర్ కోర్సులు, కమ్యూనికేషన్స్ స్కిల్స్. 

వయస్సు.. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల యువతి యువకులు ఈ ఉచిత శిక్షణకు అర్హులు.

 విద్యార్హత.. పదవ తరగతి లేదా ఆ పైన ఉత్తీర్ణత సాధించి ఉండాలి .

కావలసిన పత్రాలు..

ఆధార్ కార్డు, పదవ తరగతి మెమో, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో రావాలని తెలిపారు.

 ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో

 నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయం,

 ఎండల టవర్స్ ఎదురుగా ,

వినాయక్ నగర్ ,నిజామాబాద్

 నందు సంప్రదించాలని సూచించారు.

 మరిన్ని సమగ్ర వివరాల కోసం 63039 93849 ,95024 25603 మొబైల్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

21, ఆగస్టు 2026, శుక్రవారం

ఏడాది పాటు " ఫ్రీ గూగుల్ ఏ ఐ ప్లస్"

 విద్యార్థులకు గూగుల్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.. 

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతీయ కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది." గూగుల్ ఏ ఐ ప్లస్" సబ్ స్క్రిప్షన్ ను" ఏడాది పాటు ఉచితంగా" అందించనున్నట్లు ప్రకటించింది.

గూగుల్ ఏ ఐ అసిస్టెంట్,సెర్చ్ ద్వారా ఎడ్యుకేషనల్ టూల్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది . అమెరికా లోని కాలేజీ విద్యార్థులకు గూగుల్ ఏ ఐ ప్రో ప్లాన్ ను ఉచితంగా అందిస్తుండగా.. ఇప్పుడు భారతీయ కాలేజీ విద్యార్థుల కోసం " గూగుల్ ఏ ఐ ప్లస్" ను తీసుకు రానున్నది.

20, ఆగస్టు 2026, గురువారం

మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ @ బెంగళూరు

 బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ ఝాన్సీ బీవీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ,కుటుంబ కష్టాలను అధిగమించి తాను ఆటో నడుపుతూ, హ్యాండిల్ పట్టి తన జీవితాన్ని చక్కదిద్దుకున్న ఆమె ప్రస్తుతం తోటి మహిళలకు" ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ"  ఇస్తూ వారి ఆర్థిక స్వాతంత్రానికి ఆశాదీపం గా నిలుస్తోంది. 

ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ధైర్యంగా బెంగళూరు వీధులలో ఆటో తోలుతూ ,తోటి మహిళలకు ఆటో నడపడం నేర్పించే శిక్షకురాలిగా సమాజం గుర్తిస్తోందని, కానీ తన మార్గంలో దారి పొడవునా కన్నీళ్ళు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అడ్డంకులు ఎన్నో ఉన్నాయంటారు జాన్సీ. 

నేను ఆటో హ్యాండిల్ పట్టి రోజు వారి ఆదాయం పొందుతూ ఆర్థికంగా నిలదోక్కుకున్నాక నా ఆలోచన ధోరణిలో ఒక పెద్ద మార్పు వచ్చింది .బెంగళూరు వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్న మహిళలు కనిపించేవారు. కానీ వారికి సరైన దారి చూపించే వారు లేరని నాకు అర్థమైంది. 2021 లో ఇందిరానగర్ ఆర్టిఏ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు .అక్కడ ఉపాధి పొందే తపన ఉండి కూడా డ్రైవింగ్ నేర్చుకోవడానికి తగిన అవకాశాలు లేదా ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న కొందరు మహిళలను ప్రత్యక్షంగా చూశాను. ఆ క్షణమే ఒక స్థిర నిశ్చయానికి వచ్చాను. దేవుడు నాకిచ్చిన ఈ నైపుణ్యాన్ని, నా అనుభవాన్ని తోటి సోదరీమణులకు" ఉచితంగా పంచాలని"  నిర్ణయించుకున్నాను. 

ఆ రోజు నుంచి ఉపాధి కోరుకునే మహిళలకు "ఉచితంగా ఆటో డ్రైవింగ్ తరగతులు"  ప్రారంభించాను. నా దగ్గరకు వచ్చే ప్రతి మహిళకు వాహనం నడపడమే కాకుండా, రోడ్డు భద్రత నియమాలు, వాహన నిర్వహణ ,ప్రయాణికులతో ఎలా నడుచుకోవాలో కూడా నేర్పిస్తున్నాను. ఇప్పటివరకు బెంగళూరు నగరంలో వందలాది మంది మహిళలకు రూపాయి కూడా తీసుకోకుండా ఆటో డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చాను. నాలుగు గోడలకే పరిమితమైన గృహిణులు, తక్కువ జీతాలతో ఇబ్బందులు పడుతున్న మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే నా ఆశయం. నా వద్ద శిక్షణ తీసుకున్న మహిళలు ఈరోజు బెంగళూరు రోడ్లపై ఎంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఆటోలు నడుపుతూ వారి కాళ్లపై వారు నిలబడుతున్నారు. అది చూసినప్పుడు ఆనందంగా ఉంటుంది అంటారు ఝాన్సీ బీవీ. 



ఫ్రీ CPR ట్రైనింగ్@డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్

 


గుండె ఆగిపోయిన మనిషికి తిరిగి ప్రాణం పోసే ప్రక్రియ సి పి ఆర్ ..దీనిని ఎంతమందికి నేర్పిస్తే సమాజానికి అంత మేలు చేసిన వాళ్ళం అవుతాము అన్నది తమ సంకల్పమని డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ నర్లింగల కీర్తన యాదవ్ అన్నారు.

 అందుకే తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలు, కోర్టులు, పోలీసు కార్యాలయాలు సహా వివిధ చోట్ల క్యాంపులు నిర్వహించి ఇప్పటివరకు సుమారు లక్ష మందికి" ఉచితంగా సి పి ఆర్ ట్రైనింగ్"  ఇచ్చినట్లు తెలిపారు. రెడ్ క్రాస్, హ్యాండ్స్ ఆన్ హార్ట్ ఫౌండేషన్లు తమతో కలిసి పని చేస్తున్నాయని ఆమె వివరించారు. దీనితో పాటుగా కొన్ని అత్యవసర ప్రాథమిక చికిత్సలను పౌరులకు నేర్పుతున్నట్లు చెప్పారు. కరెంటు షాక్ కొట్టినప్పుడు, పాము కరిచినప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు ,పిల్లలకు ఏదైనా గొంతులో అడ్డుపడినప్పుడు, బీపీ డౌన్ అయితే, షుగర్ స్థాయిలు పడిపోతే.. ఇలా ప్రాణం పోయే పరిస్థితులలో ఆసుపత్రిలో చేర్చేలోగా ఎలాంటి సహాయం అందించాలి అనేది కూడా ఈ క్యాంపెయిన్ లో భాగంగా  నేర్పుతున్నామని ఆమె వివరించారు.

 ఎవరైనా తమ కార్యక్రమంలో భాగం అవ్వాలనుకుంటే drnaari అనే ఇంస్టాగ్రామ్ పేజీ లేదా drnaari.com అనే వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 



ఫిజిక్స్ వాలా నేషనల్ స్కాలర్ షిప్ కం అడ్మిషన్ టెస్ట్ 2026

 నీట్ , జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఫిజిక్స్ వాలా నేషనల్ స్కాలర్షిప్ కం అడ్మిషన్ టెస్ట్ 2026 నాలుగవ ఎడిషన్ను ప్రకటించింది .ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్, ఫిజిక్స్ ,కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలకు చెందిన ఐదు నుంచి 12వ తరగతి విద్యార్థులు, 12వ తరగతి పాసైన విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు" ఉచితంగా పేర్లను నమోదు"  చేసుకోవచ్చని వెల్లడించింది. అర్హులైన విద్యార్థులు 100% వరకు ట్యూషన్ ఫీజు మినహాయింపు తో కూడిన స్కాలర్షిప్ లను పొందవచ్చని, అర్హులైన మొదటి 500 మంది విద్యార్థులకు" ఉచిత విద్యను ఉచిత హాస్టల్ వసతిని"  కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఆన్లైన్ పరీక్షను ఎంచుకునే విద్యార్థులు అక్టోబర్ 1 నుంచి 15 మధ్య పరీక్షకు హాజరు కావచ్చు అని, ఆఫ్లైన్ పరీక్షలు అక్టోబర్ 3,4, 10, 11 తేదీలలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. 

ఫ్లైబ్రరీ.. ఉచిత గ్రంథాలయం @ ఎయిర్ పోర్ట్

 విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత విమానం కోసం ఎదురు చూడడం కొందరికి బోర్ గ అనిపిస్తుంది. ఫోన్లో స్క్రోల్ చేస్తూ సమయం గడిపిన కొద్దిసేపటికి విసుగు వస్తుంది. అదే మంచి పుస్తకం చేతిలో ఉంటే.. చదవాలని ఉండి రోజువారి జీవితంలో సమయం దొరకని పుస్తకాన్ని ప్రశాంతంగా చదివే అవకాశం వస్తే, అంతకంటే ఆనందం మరొకటి ఉండదు అని చెప్పవచ్చు.

 ఈ ఆలోచనతోనే కొన్ని విమానాశ్రయాలలో ఫ్లైబ్రరీలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లైబ్రరీ అంటే" విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఉచిత గ్రంథాలయం". విమానం కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు తమకు నచ్చిన పుస్తకాన్ని తీసుకొని చదవవచ్చు. విమానం వచ్చేసినా చదవడం పూర్తి కాకపోతే ఆ పుస్తకాన్ని వెంట తీసుకెళ్లి ప్రయాణంలో కూడా చదువుకోవచ్చు. అనంతరం వారు దిగిన విమానాశ్రయంలోని ఫ్లైబ్రరీలో దానిని ఇచ్చి వెళ్లిపోవచ్చు .

భువనేశ్వర్ లో మొదలైంది..

 ఈ తరహా ప్రయోగానికి భువనేశ్వర్ లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదిక అయింది. 2025 లో "టేక్ ఏ బుక్ " అనే నినాదంతో లైబ్రరీని ప్రారంభించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయంలో ఇంగ్లీష్, హిందీ, ఒడియా భాషలలో సుమారు 600 పుస్తకాలు అందుబాటులో ఉంచారు. బాలల పుస్తకాలు, నవలలు, మేగజైన్లు  తదితర విభాగాలకు చెందిన పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి. డిపార్చర్ ,అరైవల్ ప్రాంతాలలో పుస్తకాల అరలని ఏర్పాటు చేశారు. ఇందులో పుస్తకాల నిర్వహణ ,అరలని సర్దడం వంటి పనులలో వాలంటీర్లు సహకరిస్తున్నారు. ఇక ఈ ఆలోచనకు ఇతర విమానాశ్రయాలలోనూ ఆదరణ లభిస్తోంది. తాజాగా ప్రయాగరాజ్ విమానాశ్రయంలోను ఫ్లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాలను విరాళంగాను ఇవ్వవచ్చు .. ఈ ఫ్లైబ్రరీల ఏర్పాటు కేవలం సమయాన్ని సద్వినియోగం చేయాలని ఆలోచనతో రూపుదిద్దుకున్న కార్యక్రమం. ప్రయాణికుల మీద నమ్మకం, సమాజ భాగస్వామ్యం పై ఆధారపడి పని చేస్తుంది. పుస్తకాలను తీసుకున్న వారు తిరిగి ఇచ్చే విషయంలో స్వీయ బాధ్యతతో వ్యవహరించాలి. ఈ ఫ్లైబ్రరీల కోసం పుస్తకాలను విరాళంగా కూడా ఇవ్వవచ్చు అని నిర్వాహకులు కోరుతున్నారు. 



19, ఆగస్టు 2026, బుధవారం

ప్రతి నెలా.. ఉచిత జాబ్ మేళా @ నిజామాబాద్

 నిరుద్యోగుల కోసం ఇక నుంచి" ప్రతి నెలా ఉచిత జాబ్ మేళా" నిర్వహించనున్నట్లు నిజామాబాద్ జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ వేల్పుల విజేత తెలిపారు. గత నెల నిర్వహించిన మెగా జాబ్ మేళా లో 4620 మంది టామ్ కామ్ లో నమోదు కాగా 120 మంది జర్మనీ లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. 

వారందరూ జర్మనీ భాష నేర్చుకోవడానికి " ఫ్రీ కోచింగ్ సెంటర్" ను ఏర్పాటు చేశామని తెలిపారు.

నిజామాబాద్ నగరంలో మంగళ వారం 168 పోస్టులకు( నర్సులు,రిసెప్షనిస్ట్, ఫార్మసిస్ట్ , షోరూం మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ,మెకానిక్) ఉచిత  జాబ్ మేళా నిర్వహించగా 52 మంది సెలెక్ట్ అయ్యారని ,వారికి ప్రూండెన్స్ హాస్పిటల్, అపోలో ఫార్మసీ, మహీంద్రా షోరూం ల నుండి వచ్చిన ప్రతినిధులు జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అపాయింట్మెంట్ లెటర్స్ అందచేశారని తెలిపారు. 

ఇకనుంచి ప్రతి నెలా నిరుద్యోగుల కోసం " ఉచిత జాబ్ మేళా" నిర్వహించనున్నట్లు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

18, ఆగస్టు 2026, మంగళవారం

కృత్రిమ మేధ నుండి.. కుట్లు అల్లికల వరకు.. ఉచిత శిక్షణ

 నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ శాఖలతో పాటు , స్వచ్ఛంద సంస్థలు, గురుకులాలు, బ్యాంకులు, ఏ టి సి లు తదితర ఎన్నో సంస్థలలో యువతకు ఉపాధి అవకాశాలు పొందేందుకు, ఉద్యోగాలు పొందేందుకు , ఉన్నత విద్య లో ప్రవేశం పొందేందుకు .. ప్రవేశ పరీక్ష లకు " ఉచిత శిక్షణ లు " అందుబాటు లోనికి వచ్చాయి.. 

జీవితంలో ఎదగాలి,ఏదైనా సాధించాలి అనే తపన ఉన్న విద్యార్థులే కాకుండా నిరుద్యోగ యువత కు,మహిళలకు,కార్మికులకు ఇవి ఎంతో సహాయకారిగా ఉంటున్నాయి. చదువు పై శ్రద్ధ, నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఆసక్తి గలవారు ఉన్నత స్థాయి కి వెళ్లేందుకు ఈ ఉచిత శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయా సంస్థల నిర్వాహకులు పేర్కొంటారు..అలాంటి సంస్థల సంక్షిప్త వివరాలు ఇవి..

టాస్క్ లో నైపుణ్య అభివృద్ధి..

చదువుతో పాటు భవిష్యత్ లో ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి " టాస్క్" శిక్షణలు ఉపయోగపడతాయి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వివిధ కోర్సులు చదవొచ్చు. ప్రవేశాలకు ఈ నెల 31 వరకు గడువు ఉంది. కంప్యూటర్ కోడింగ్, లాంగ్వేజెస్, ఏ ఐ టూల్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. 

ప్రైవేట్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ముఖాముఖి, బృంద చర్చ నైపుణ్యాలు నేర్పుతారు.

పూర్తి సమగ్ర వివరాలకు 91542 52588 , 7013675052 జిల్లా మేనేజర్ రఘుతేజ్ ను సంప్రదించవచ్చు.

భవన నిర్మాణ రంగంలో..

కార్మిక సంక్షేమ శాఖ, న్యాక్ ఆధ్వర్యంలో ప్లంబింగ్,శానిటేషన్,పెయింటింగ్,డెకొరేషన్, తాపీ మేస్త్రి, ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్ పనులపై 15 రోజుల పాటు నైపుణ్యాలు నేర్పుతారు.

పూర్తి సమగ్ర వివరాలకు 98663 50200,99597 73079 నిజామాబాద్, 97045 87655 భీమ్ గల్.. ఫోన్ నెంబర్ లలో సంప్రదించాలని సూచిస్తున్నారు.. 

స్వయం ఉపాధి కోసం భరోసా..

డిచ్ పల్లిలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 19-45 ఏళ్ల వయసు గల గ్రామీణ మహిళలు ,యువతకు స్వయం ఉపాధి కోర్సులు నేర్పిస్తున్నారు.

మగ్గం వర్క్స్, హోం నీడ్స్ తయారీ,ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్,సర్వీస్,రిటైల్, కుట్టు మిషన్,కుట్లు అల్లికల లో నైపుణ్యం పొందవచ్చు.

పూర్తి సమగ్ర వివరాలకు..08461-222428 నంబరులో సంప్రదించాలి.

నైపుణ్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు పొందేందుకు..

పదో తరగతి పాసైన నిరుద్యోగ యువత కు వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవసరమైన శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము ను జిల్లాలోని 7  అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ( ఏ టీ సీ) లలో నేర్పిస్తున్నారు. 

ఇక్కడ అందించే కోర్సుల వివరాలు తెలుసుకునేందుకు నిజామాబాద్ లోని ప్రభుత్వ ఐటిఐ లో గానీ,94417 07536 నంబరును గానీ సంప్రదించవచ్చు. 

నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలకు..

నీట్, జేఈఈ మెయిన్స్ ఉన్నత విద్య పోటీ పరీక్షలకు ప్రైవేటులో శిక్షణ కు భారీగా ఖర్చు అవుతుంది.అందుకే జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, కేజీబీవీ సీ వో ఈ లలో వంద మంది విద్యార్థుల చొప్పున ఉచిత శిక్షణ ఇస్తున్నాయి.ఇటీవలే ఇంటర్ పాసైన వారికి లాంగ్ టర్మ్ శిక్షణ కు ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.సాంఘిక, బీసీ సంక్షేమ గురుకులాల ఆర్ సీ వో కార్యాలయాలలో సంప్రదించాలి.

బీసీ స్టడీ సర్కిల్ ఉచిత ఫౌండేషన్ శిక్షణ..

టీ జీ పీ ఎస్ సి గ్రూప్స్ తో పాటు బ్యాంకింగ్, ఆర్ ఆర్ బి , స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగార్థులకు .. నిజామాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ లో 125 రోజులపాటు ఉచిత ఫౌండేషన్ శిక్షణ ఇస్తున్నారు . ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు అర్హులు.

పూర్తి సమగ్ర వివరాలకు 08462-241055 నంబరులో సంప్రదించాలి.

ఇవే కాకుండా వ్యవసాయ, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో " రైతు శిక్షణ", "పశు వైద్యం","పాల ఉత్పత్తి"  పై శిక్షణ లు అందుబాటు లో ఉన్నాయి. 

ఉచిత "అర్జంట్ కేర్ సెంటర్" @ జగిత్యాల

 గ్రామీణ ప్రాంత ప్రజలకు" ఉచితంగా అత్యవసర వైద్య సేవలు"  అందించడమే ప్రధాన లక్ష్యంగా" శ్రీ సత్య సాయి సుజల స్రవంతి ట్రస్ట్"  ఆధ్వర్యంలో జగిత్యాల గ్రామీణ టీ ఆర్ నగర్, రాజారాం గ్రామం వద్ద ఏర్పాటుచేసిన" సాయి స్వస్థ షా హ్యాపీనెస్ అర్జెంట్ కేర్ సెంటర్" ను ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, మునిసిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి సోమవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల, మల్యాల నియోజకవర్గాల పరిధిలోని గ్రామీణ ప్రజలకు ఈ కేంద్రం ద్వారా" ఉచితంగా అత్యవసర వైద్య సేవలు"  అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు సకాలంలో వైద్యం అందించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలకు తోడుగా ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలను విరివిగా విస్తరింప చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, డిసిసి అధ్యక్షుడు గాజంగి నందయ్య తదితరులు పాల్గొన్నారు. 

17, ఆగస్టు 2026, సోమవారం

ఉచిత కరాటే శిక్షణ @ ఇబ్రహీం పేట్, బాన్సువాడ

 కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీం పేట్ గ్రామంలో చిన్నారులకు గ్రామీణ స్థాయిలో" ఉచితంగా కరాటే శిక్షణ శిబిరం"  ఆదివారం ప్రారంభించారు. 



ఈ సందర్భంగా కరాటే మాస్టర్ లు శివరాం, ఫణీందర్ గౌడ్ లు మాట్లాడుతూ .. "ప్రతి ఆదివారం" స్థానిక వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో కరాటే మాస్టర్ వినీల్ ఆధ్వర్యంలో ఉచితంగా కరాటే శిక్షణ నిర్వహించనున్నామని అన్నారు. 

చిన్నారుల్లో ఆత్మ విశ్వాసం, క్రమ శిక్షణ, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంతో పాటుగా ఆత్మ రక్షణ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో శిక్షణ ప్రారంభించామన్నారు. ఈ అవకాశాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...