అది హర్యానాలోని ఫరీదాబాద్ పట్టణంలోని సెక్టార్ 35 లోని ఒక భవనము. జనం వరుసగా నిలబడి తమ వంతు వచ్చాక మందుల చిట్టీ ని అక్కడున్న వాలంటీర్ల చేతులలో పెడుతున్నారు. వారు వాటిని పరిశీలించి.. అరలలో ఉన్న మందులను సంచులలో ఉంచి ..రోగులకో, వారి తరపు వారికో,వారి బంధువులకో అప్పగిస్తున్నారు. ఆ కేంద్రాన్ని స్థానికులు "మెడిసిన్ బ్యాంక్ " అని పిలుచుకుంటారు.
" మెడిసిన్ బాబా ఫౌండేషన్" ద్వారా నడుస్తున్న ఈ కేంద్రం వ్యవస్థాపకురాలు మీనూ గోయల్. సాధారణంగా బ్యాంకులలో మనం డిపాజిట్ చేసిన డబ్బు మళ్ళీ మనమే తీసుకుంటాము. మా మెడిసిన్ బ్యాంకులో మనం డిపాజిట్ చేస్తే అవసరం ఉన్నవారు వాటిని విత్ డ్రా చే. అదే రెండింటికి తేడా అంటారు మీను గోయల్ గారు.
ఎన్నోఅపార్థాలు ,అనుమానాల నడుమ..
మెడిసిన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆవేదనలో నుంచి వచ్చిందంటారు మీను గోయల్. మన దేశంలో రొట్టె ముక్క కొనుక్కునే స్తోమత లేని వారు కోట్ల మంది ఉన్నారు. వారికి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ ఫీజులకు, మందులు కొనుక్కోవడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. చాలా వైద్య కేంద్రాలలో మందులు ఉండవు. వాటిని కొనలేక ,వైద్యాన్ని ముందుకు కొనసాగించలేక ఎంతో మంది కృంగిపోతున్నారు. వ్యాధులు ముదిరి మరణిస్తున్నారు. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక చేదు వాస్తవం. అలాగే వ్యాధి నయమయ్యాక వైద్యులు వేరేవి వేసుకోమన్నారు అని చెప్పడం వలననో ,లేదా రోగులు మరణించాకో.. మిగిలిపోయిన మందులను చెత్త కుప్పల మీద పారేస్తున్నారు అనేది కూడా మరొక కఠిన వాస్తవం. వాటిని అవసరమైన వారికి అందిస్తే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు అనిపించింది నాకు. దాన్ని నా మిత్రులతో చర్చించాను. అలా ఆరు సంవత్సరాల క్రితం మెడిసిన్ బ్యాంకుకు అంకురార్పణ జరిగింది అని వివరించారు మీను.
ఏ కొత్త ప్రయత్నానికైనా ముందు తలెత్తే బాలారిష్టాలు దీనికి వచ్చాయి. మా కాన్సెప్ట్ను కొందరు అపార్థం చేసుకున్నారు. మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు. కానీ మా నిబద్ధతను గమనించిన తర్వాత మద్దతుగా నిలబడ్డారు. ఆ విషయంలో మా బృందానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి అంటున్నారు మీను.
సేకరణ కోసం బాక్సులు ..
12 మంది సభ్యుల ఆమె బృందంలో కార్పొరేట్ నిపుణులు, న్యాయవాదులు, బ్యూటీషియన్లు ఇలా వివిధ వృత్తుల వారు ఉన్నారు. ప్రారంభంలో ఇంటింటికి వెళ్లి మందులు సేకరించడం ప్రారంభించారు .తర్వాత సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కొద్ది రోజులలోనే మంచి స్పందన వచ్చింది. మందులను స్వయంగా తెచ్చి ఇచ్చేవారు కొందరైతే, కొరియర్ ద్వారా మరికొందరు అందిస్తున్నారు. ఇప్పుడు విదేశాల నుంచి కూడా పంపిస్తున్నారు. మిగిలిన మందులను ఏం చేయాలా అని ఆలోచించే వారికి కూడా ఇప్పుడు తక్షణం గుర్తుకు వచ్చేది ఆ సంస్థ నే .దీనితో పాటు ఫరీదాబాద్ లోని బహిరంగ ప్రదేశాలు, ఆలయాలు, హౌసింగ్ సొసైటీలలో దాదాపు 30 మెడిసిన్ బాక్సులు ఏర్పాటు చేశారు. మిగిలిన మందులను జనం ఆ బాక్సులలో వేస్తే మీను బృందం వాటిని సేకరిస్తుంది. అలా అందిన మందులలో గడువు ముగిసిన వాటిని తొలగిస్తారు. మిగిలిన వాటిని కేటగిరిల వారిగా మెడిసిన్ బ్యాంకులో భద్రపరుస్తారు .రోగులు ప్రెస్క్రిప్షన్ను తీసుకొస్తే దాని ప్రకారం మందులు అందజేస్తారు.
ఆ ఘనత వారిదే అంటున్న మీను..
నగరంలో చాలామంది వైద్యులు మాతో కలిసి పనిచేస్తున్నారు. పేద రోగులను ఉచితంగా పరీక్షించి, ప్రిస్క్రిప్షన్లు రాసి మా దగ్గరకు పంపుతున్నారు. ఇప్పుడు సాధారణ ఇబ్బందుల నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు దాదాపు అన్ని సమస్యలకు మా దగ్గర మందులు ఉన్నాయి. వాటి వివరాలు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరైనా వచ్చి వాటిని తీసుకెళ్లొచ్చు. ఎవరి దగ్గరైనా మందులు ఉన్నాయని చెబితే వాటిని మేము కలెక్ట్ చేసుకుంటాము. ఇప్పటివరకు కొన్ని వేల మంది మా సంస్థ ద్వారా లబ్ధి పొందారు. వైకల్యాలు ఉన్న వృద్ధుల కోసం వీల్ చైర్లు తదితరాలు కూడా సమకూర్చుతున్నాము.
" మేము చేసేదంతా పూర్తిగా ఉచితమే". ఎవరి నుంచి విరాళాలు కానీ, వేరే సహాయం కానీ మేము తీసుకోవడం లేదు .మా వృత్తుల ద్వారా వచ్చేది మాకు సరిపోతుంది. వేరే ఖర్చులు ఏమైనా ఉంటే అందరం కలిసి పంచుకుంటున్నాం అని చెబుతున్నారు మీను గోయల్.
అబ్బాయిలాంటి హెయిర్ కట్ ,ప్యాంటు షర్టుతో కనిపించే మీను తన వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా రోజు కనీసం రెండు గంటల సమయాన్ని ఈ కేంద్రం కోసం కేటాయిస్తారు. అత్యవసరమైతే అన్నివేళలా ఆమె బృందం అందుబాటులో ఉంటుంది. ఇదంతా మా ఘనత అని అనుకోవడం లేదు, పౌరులు తమ సామాజిక బాధ్యతగా భావించడం వలన మెడిసిన్ బ్యాంకు ను నడపగలుగుతున్నాం. ప్రజల భాగస్వామ్యం ,సహానుభూతి ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది అని అంటారు మీను వినయంగా.