3, ఆగస్టు 2026, సోమవారం

దోమకొండ గడికోట ట్రస్ట్ వారి ఉచిత సేవలు

 దోమకొండ గ్రామంలో బీడీ కార్మికులు, కూలీలు ఎక్కువగా ఉండడంతో వారి కుటుంబాలలో మెరుగైన ఆర్థిక పరిస్థితులు లేవు. అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని వైద్యులకు చూపించలేని పరిస్థితిలో పలు కుటుంబాలు ఉండేవి. ఈ నేపథ్యంలో నిరుపేదలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో దోమకొండ గడికోట ట్రస్ట్, గ్రామ అభివృద్ధి సంస్థ కలిసి ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాయి. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనిమిదేళ్లుగా ఈ ఉచిత వైద్య సేవలు నిరంతరాయంగా అందుతున్నాయి. 

ట్రస్ట్ ఆధ్వర్యంలో 2017 లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అధిక సంఖ్యలో బాధితులు శిబిరానికి వచ్చారు. చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో పాటు బీపీ, షుగర్ వంటి వాటితో బాధ పడుతూ వైద్య పరీక్షలకు వెళ్లలేని దుస్థితిని ట్రస్ట్ ప్రతినిధులు గ్రహించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులను సర్వే నిర్వహించి గుర్తించారు. నిరుపేదలైన రోగులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, మందులు అందించాలని ట్రస్ట్ వారు సేవలందించడానికి  పూనుకున్నారు. 

జూలై 18,2018 నుంచి ప్రతి నెలా రోగులకు వైద్యులచే పరీక్షలు చేయిస్తూ, మందులను అందిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా ఈ సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. డయాబెటిస్ తో బాధ పడుతున్న ముగ్గురు విద్యార్థులకు సైతం ప్రతి నెలా సరిపోవు ఇంజక్షన్లు, మందులను అందిస్తూ వారి చదువులకు ఊతమిస్తున్నారు. 

అపోలో ఆసుపత్రి వారి సహకారంతో ఈ ఉచిత వైద్య సేవలు అందించడం , నిరుపేద కుటుంబాల్లో ఆత్మీయత,సంతోషం నెలకొనడం ఎంతో తృప్తిని ఇస్తుందని దోమకొండ గడికోట ట్రస్ట్ సీనియర్ మేనేజర్ బాబ్జీ గారు పేర్కొన్నారు.

125 రోజుల ఉచిత శిక్షణ / ఫౌండేషన్ కోర్స్

 తెలంగాణ రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిల్ ల ద్వారా  వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 125 రోజులపాటు ఇచ్చే ఉచిత కోచింగ్ కు  అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ ,ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల అభ్యర్థులు/ఈ బీ సీ,అనాధ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. గ్రూప్ వన్ ,గ్రూప్ టు, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్ లతోపాటు పోలీస్ నియామక పరీక్షలు, బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్లు సమర్పించాలి. 

ఈ ఉచిత శిక్షణ కు ఎంపికైన వారి జాబితాను వారి డిగ్రీ మార్కుల ఆధారంగా ఆగస్టు 18 వ తేదీన విడుదల చేస్తారు. ధృవ పత్రాల పరిశీలన చేస్తారు. ఆగస్టు 25 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.

అభ్యర్థి డిగ్రీ పాస్ అయి ఉండాలి,కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలకు మించ రాదు. ప్రతి నెలా 75 శాతం ,అంతకంటే ఎక్కువ హాజరు ఉన్న అభ్యర్థులకు 5 నెలల పాటు నెలకు 1000 రూపాయలు పుస్తక నిధిగా రవాణా భత్యంతో కలిపి స్టయిఫండ్ గా చెల్లింపబడుతుంది.

రెగ్యులర్ కోర్సులు చదువుతున్న వారు, ఉద్యోగం చేస్తున్నవారు, గతంలో బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్ పొందినవారు ఈ ఉచిత శిక్షణ కు అనర్హులు. 

అర్హులైన అభ్యర్థులు..

 www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు నెట్ ఫ్లిక్స్ ప్లాన్ ఉచితం

 ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరియు ఓటీపీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తమ కస్టమర్ల కోసం జత కట్టాయి. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులు ప్రతి నెలా 299 అంత కంటే ఎక్కువ విలువైన 4 ఆర్డర్ లను పూర్తి చేయడం ద్వారా నెట్ ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ను ఉచితంగా పొందవచ్చు. ఈ భాగస్వామ్యం ఫ్లిప్ కార్ట్, ఫ్లిప్ కార్ట్ గ్రోసరీ, ఫ్లిప్ కార్ట్ మినిట్స్ లో చేసే రోజు వారీ షాపింగ్ కు రివార్డ్ పాయింట్స్ అందిస్తుంది. దేశ ఈ కామర్స్ చరిత్ర లోనే మొదటి సారిగా ప్రపంచంలోనే టాప్ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ను రోజు వారీ షాపింగ్ ద్వారా పొందవచ్చు. ఈ ప్రయోజనం ఆగస్టు 1 నుండి అమలు లోకి వస్తుంది. ఫ్లిప్ కార్ట్ సభ్యులు ఒక క్యాలండర్ నెల లోపు 299 అంత కంటే ఎక్కువ విలువ ఉన్న 4 ఆర్డర్ లను పూర్తి చేయాల్సి ఉంటుంది. అర్హత కలిగిన 4 ఆర్డర్ లు పూర్తి అయిన తర్వాత నెట్ ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ను 30 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ యాప్ ద్వారానే ఈ ప్రయోజనాన్ని యాక్టివేట్ చేస్తారు. ప్రత్యేక లాగ్ ఇన్ అవసరం లేదు. 30 రోజుల తర్వాత ఈ ప్రయోజనం రీసెట్ అవుతుంది. ఇదే షాపింగ్ పద్ధతి ద్వారా దీన్ని మళ్ళీ పొందవచ్చు. 

ఫ్లిప్ కార్ట్ సభ్యులు కాని కస్టమర్ లు 12 నెలల లోపు 15 ఆర్డర్ లను పూర్తి చేసిన తర్వాత వెనువెంటనే అదనపు ప్రయోజనానికి ఆటోమేటిక్ గా అర్హత పొందుతారు. 

సాలార్జంగ్ మ్యూజియంలో ఫ్రీ ఎంట్రీ

 ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు హైదరాబాదులోని సాలార్జంగ్ మ్యూజియంలో ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ . ఈ మేరకు అన్ని జిల్లాల డిఈఓ లకు ఆదేశాలు జారీ చేశారు .విద్యార్థులకు మన దేశ సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన కల్పించేందుకు ఈ విహారయాత్రలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యాత్ర డిసెంబర్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు .ప్రభుత్వ బడులతో పాటు ప్రైవేటు ,ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులు కూడా ఈ ఉచిత సందర్శన కు అర్హులు అని ఆయన తెలిపారు. 

ఉచిత ఆర్చరీ శిక్షణ @దోమకొండ

 ఆర్చరీ క్రీడల్లో జోరుగా పతకాలు సాధిస్తున్న క్రీడాకారులు... 

దోమకొండ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తూ కఠోర సాధన తో విజయాలు సాధిస్తున్నారు .వరుస విజయాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కఠోర సాధన, లక్ష్యంపై అచంచలమైన ఏకాగ్రతతో దోమకొండ ప్రాంతానికి చెందిన యువ ఆర్చర్లు జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభను ప్రదర్శిస్తూ పతకాలు సాధిస్తున్నారు .ఆర్చరీ ఆటకు దోమకొండ కేరాఫ్ అడ్రస్ గా మారింది. 

దోమకొండ గడికోట మైదానంలో సంస్థాన వారసులైన కామినేని అనిల్ కుమార్ 2007లో ఆర్చరీ అకాడమీ ఏర్పాటుచేసి విలువిద్యకు సంబంధించిన మెలకువలను అభ్యర్థులకు ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడి ఉచిత శిక్షణతో విలువిద్య క్రీడలో దోమకొండ విద్యార్థులు రాణిస్తున్నారు .పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆర్చరీ శిక్షకుడు ప్రతాప్ దాస్ శిక్షణలో మెలకువలు నేర్చుకొని రాష్ట్ర ,జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ పతకాలు సాధిస్తున్నారు. 

ఒకవైపు చదువుతూనే నిత్యం 4 గంటల సాధన చేస్తున్నారు. 19 ఏళ్లుగా ఇక్కడ ఎంతో మంది ఆర్చరీ లో రాణించి తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చారు. దోమకొండ తో పాటు బిక్నూర్ ,బీబీపేట ,మాచారెడ్డి మండలాలకు చెందిన పలు గ్రామాల విద్యార్థులతో పాటు కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు సైతం ఇక్కడికి వచ్చి విలువిద్య నేర్చుకుంటున్నారు. 

2007లో ఇక్కడ 40 మంది విద్యార్థులతో మొదలైన ఆర్చరీ శిక్షణ ప్రస్తుతం 550 మందికి చేరిందని ఆర్చరీ కోచ్ ప్రతాప్ దాస్ గారు తెలిపారు. కామినేని అనిల్ కుమార్ గారు ఉచితంగా సొంత డబ్బులతో ఆర్చరీ మెటీరియల్  అందించి వారికి పూర్తి శిక్షణ ఇప్పిస్తున్నారు. దోమకొండ, కాచాపూర్, పెద్ద మల్లారెడ్డి, బిబిపేట, ఫరీద్ పేట, పాల్వంచ, భిక్కనూరు, రామేశ్వర పల్లి, జంగంపల్లి, కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులు కొన్నేళ్లుగా ఇక్కడికి ఆర్చరీ శిక్షణ కోసం వస్తున్నారు. దీనితో ఆర్చరీ ఆట  అంటేనే దోమకొండ అనే విధంగా తయారయింది. 

దోమకొండకు చెందిన కదిరె సింధుజ పదేళ్ల నుంచి ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ ఇప్పటివరకు 38 సార్లు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో పాల్గొన్నది. జాతీయస్థాయిలో రెండు సిల్వర్, రాష్ట్రస్థాయిలో ఓవరాల్ గా 44 బంగారు, ఐదు సిల్వర్ పతకాలు సాధించింది. ఒలింపిక్ పతకం సాధించడమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తోంది.

భిక్కనూరుకు చెందిన నిరుపేద కూలి కుటుంబానికి చెందిన అనుదీప్ 8 ఏళ్లుగా ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ జైపూర్లో నిర్వహించిన జాతీయ  పోటీలలో సిల్వర్ మెడల్ సాధించాడు.

19 ఏళ్లుగా కోచ్ గా ప్రతాప్ దాసు గారు.. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రతాప్ దాస్ గారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడారు. మొదట విజయవాడలో కోచ్ గా చేరారు. అనంతరం తనతో పాటు ఆర్చరీ ఆటలో పాల్గొన్న దోమకొండ గడికోట వారసులు కామినేని అనిల్ కుమార్ దోమకొండకు తీసుకు రావడంతో 19 ఏళ్లుగా ఇక్కడి విద్యార్థులకు కోచ్ గా ఉంటూ జాతీయ స్థాయిలో విద్యార్థులు పతకాలు సాధించేలా తీర్చిదిద్దారు. 

విలువిద్య శిక్షకుడు.. ప్రతాప్ దాస్..97051 41241

ఉచిత చేపలు, రొయ్యల పంపిణీ

 ఉచిత చేపలు రొయ్య పిల్లల పంపిణీ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 116 కోట్ల రూపాయల అదనపు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని చెరువులు రిజర్వాయర్లు ఇతర జల వనరులలో భారీ ఎత్తున చేపలను రొయ్య పిల్లలను ఉచితంగా వదిలి ఎందుకు మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్ల చేస్తున్నారు. అతి త్వరగా టెండర్లు పిలిచి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయనున్నారు .అనంతరం జిల్లాల వారీగా చేపలు రొయ్య పిల్లలను సరఫరా చేసి చెరువులలో విడుదల చేయనున్నారు .ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వేలాది చెరువులు జలాశయాలు పూర్తిస్థాయిలో నీటితో నిండాయి. చేపల పెంపకానికి ఇదే సరైన సమయం అని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం వేగవంతం కానున్నది. 

25, జులై 2026, శనివారం

ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం

 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి..


ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్ని కాపాడడం, పర్యావరణాన్ని రక్షించడం కోసం హైదరాబాద్ హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం నడుం బిగించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఇందులో మూడు పండ్ల మొక్కలు, రెండు ఔషధ మొక్కలు లేదా అలంకరణ మొక్కలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మొక్కలను పొందడం కోసం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మరియు మొబైల్ నెంబర్ సమర్పించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలోని 44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకువెళ్లాలని ప్రజలకు సూచించింది.

ఈ సంవత్సరం లక్ష కుటుంబాలకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ గోపిడి రోహిత్ తెలిపారు.

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...