2, అక్టోబర్ 2026, శుక్రవారం

ఉచిత విద్య@అగరం ఫౌండేషన్, చెన్నై.

 అగరం అంటే ఆది అక్షరం, అ కారం అని అర్థం. అకారాది అక్షరాలే జ్ఞాన ప్రపంచానికి మూలాలు. అందుకే తన సేవా సంస్థ కు ఆ పేరు ఎంచుకున్నాడు హీరో సూర్య. ఎందరో పేద పిల్లల జీవితాలను ఉన్నత శిఖరాలకు చేరుస్తున్నాడు. వేలాది గుండెల్లో హీరోగా నిలిచి అగరం తో అక్షరాలా ఒక విద్యా విప్లవమే సృష్టిస్తున్నాడు. 

గత పదిహేనేళ్ల కాలంలో వేల మంది విద్యార్థులకు అన్నీ తానై, పై చదువులు చదివించింది అగరం సంస్థ.వీరిలో 95 శాతం మందిని మెడిసిన్, ఇంజనీరింగ్,పారామెడికల్ వంటి ప్రొఫెషనల్ కోర్సులతో నిపుణులుగా తీర్చి దిద్దింది.అందులోనూ 67 శాతం మంది అమ్మాయిలే.వైద్యం,సైన్యం, ఐటీ,రీసెర్చ్ ..ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ,అందులో అగరం లబ్ధిదారులు తప్పకుండా ఉంటారు.మన దేశంలో,ప్రతి నగరంలో , ప్రపంచం లోని ప్రతి ప్రధాన దేశంలోనూ ఈ సంస్థ పూర్వ విద్యార్థులను చూడవచ్చు.అగరం సాయం పొందిన 8 వేల మందిలో ప్రతి ఒక్కరూ మరో పది మంది చదువులకు సాయం చేస్తున్నారు.

ఈ సంస్థ ఏర్పాటు వెనక ..ఒకప్పుడు తన నాన్న,నానమ్మ చిందించిన కన్నీళ్లే కారణం అంటాడు సూర్య.

సూర్య తండ్రి దండపాణి ఎన్నో కష్ట నష్టాలకోర్చి చదువు పూర్తి చేసుకొని గుళ్లలో ఉంటూ సుప్రసిద్ధ ఆలయాల చిత్రాలు గీసే పని చేశాడు. తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించి ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ గా పని చేద్దామనుకుంటే.. రూపం బాగుండడంతో .. హీరో శివ కుమార్ గా మారిపోయాడు దండ పాణి. 1970 లలో తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో అయ్యాడు. ఆయన కుమారులే.. సూర్య, కార్తి. ఓ స్థాయికి వెళ్ళాక కూడా, చదువు కోసం తాను పడ్డ కష్టాన్ని , తనకు అందిన సహాయాన్ని మర్చిపోలేదు శివకుమార్. 1979 లో శివకుమార్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ప్లస్ టూ లో మంచి మార్కులు సాధించిన పేద పిల్లలకు ఆర్థిక సహాయం చేయడం ప్రారంభించాడు. ఆ సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమంలో తన పిల్లలూ భాగస్వాములయ్యేలా ప్రోత్సహించాడు. పేద విద్యార్థుల కష్టనష్టాలు వారికి తెలిసేలా చేశాడు. అలా "అగరం" సంస్థకు ఆయనే బీజం వేశాడు. 

2006 సెప్టెంబర్ 26 న అగరం ఫౌండేషన్ స్థాపించాడు సూర్య. వేలూరు కు చెందిన విలేకరి జ్ఞానవేల్, సామాజిక కార్యకర్త, విద్యావేత్త ప్రొఫెసర్ కళ్యాణి అగరం సంస్థ లో భాగస్వాములుగా మారి సంస్థకు ఒక దశ దిశ ను అందించారు.ప్రొఫెసర్ కళ్యాణి మార్గదర్శకత్వంలోనే 2010 లో అగరం ద్వారా " విదై " (అంటే బీజం అని అర్థం)అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు సూర్య. 

తమిళనాడులో ప్లస్ టూ రాసిన నిరుపేద విద్యార్థులు ఎవరైనా అగరం ను ఆశ్రయించవచ్చు. ఫోన్ కాల్ కు స్పందించడానికి 24 గంటల హెల్ప్ లైన్ సిద్ధంగా ఉంటుంది. పిల్లల దగ్గరకు తమ వాలంటీర్లను పంపి తక్షణ సహాయం అందిస్తుంది.పెద్దవాళ్ళకు కౌన్సిలింగ్ ఇప్పిస్తుంది.దాంతోపాటే విదై కార్యక్రమానికి దరఖాస్తు తీసుకుంటుంది. ఉత్తరాల ద్వారా కూడా సంస్థ సహాయం కోరవచ్చు. అగరం ఉద్యోగులు స్వయంగా వెళ్ళి వాస్తవ పరిస్థితి అంచనా వేసి "విదై" కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. 

అగరంలోని 400 మంది వాలంటీర్లతో ఈ మహత్కార్యాలు నడుస్తున్నాయి. అగరం.. ఒక్క తమిళనాడు లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నత ప్రమాణాలతో విద్యాసేవ అందిస్తున్న అతిపెద్ద ఎన్జీవోల్లో ఒకటి. అగరం 2023 లో జవ్వాది కొండలూ, నీలగిరి పర్వతాలలోని గిరిజన గూడెల్లో ఉన్న బడుల్ని బాగు చేయడం కోసం " నమదు పల్లి ఫెలోషిప్" అంటే మన బడి ఫెలోషిప్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టి ఆ పాఠశాలల తీరుతెన్నులను సమూలంగా మార్చి వేసింది. 



అగరం చిరునామా..
15/4 , అరులంబల్ వీధి,
టి నగర్,
చెన్నై - 600017,
తమిళనాడు,
ఇండియా.


కాంటాక్ట్..

ఈ మెయిల్.. info@agaram.in  , 
+91 98418 91000, 044-43506361




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఫ్రీ గణపతి అర్చన@వేదమందిర్

ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వేద మందిర్ వారు ఇప్పుడు ఫ్రీ గా , 100% ఉచితంగా మీ పేరు మీద " గణపతి అర్చన" జరుపుకునే అవకాశం కల్పిస్త...