2, అక్టోబర్ 2026, శుక్రవారం

ఉచిత డెయిరీ నిర్వహణ శిక్షణ@రైతన్న డెయిరీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన శ్రీ కమ్మ నాగేశ్వర రావు గారు తన జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదిగి 2021 లో మార్టూరు లో " రైతన్న డెయిరీ" స్థాపించారు. 

నష్టాలూ, సవాళ్ళూ పలకరించినా " కుండ పెరుగు" తో 50 కోట్ల రూపాయల బ్రాండ్ గా ఎదిగారు.తను సాధించడమే కాదు ,తనలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన,పైకి ఎదగాలన్న కసితో ఉన్న యువతకు తన " డెయిరీ స్కూల్" లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.

ప్రస్తుతం ఆయన వ్యాపారం విలువ 50 కోట్ల రూపాయలు.దీనిలో సింహ భాగం కుండ పెరుగు దే.గ్రామాల్లో ఉన్న యువత తమ కలలను నిజం చేసుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.వారికి ఉచితంగా " డెయిరీ నిర్వహణ పాఠాలు" నేర్పుతున్నారు.

మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు కుండల తయారీ , కుండ పెరుగు,ఇతర పాల ఉత్పత్తుల తయారీ,మార్కెటింగ్ పైన ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కాలంలో రూ.7,500 ఉపకార వేతనం అందిస్తూ , ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నారు.

ఇప్పటివరకు 5000 మంది విద్యార్థులు.. వ్యవసాయ కళాశాలల నుంచి , ఇంజనీరింగ్, ఎం బీ ఏ చదివే వారు ఉచిత శిక్షణ తీసుకుంటే, అందులో 500 మంది సొంతంగా డెయిరీలు పెట్టుకుని రాణిస్తున్నారు. ఆరవ తరగతి చదివిన తాను పీజీ చదువుతున్న పిల్లలకు వ్యాపార పాఠాలు చెప్తున్నందుకు ఎంతో సంతృప్తి పొందుతున్నట్లు వివరిస్తారు శ్రీ నాగ మల్లేశ్వర రావు గారు. 


1, అక్టోబర్ 2026, గురువారం

ఉచిత నాట్య శిక్షణ @ కూచిపూడి కళా క్షేత్రం, కామారెడ్డి.

 ఆయనొక నిత్య నృత్య విద్యార్థి. చదువుకునే రోజుల్లోనే భారతీయ నృత్య కళలను అభ్యసించాడు. కఠోర సాధన చేశాడు. జానపద, శాస్త్రీయ నృత్యాలపై పట్టు సాధించాడు. జ్యోతిబా ఫూలే , సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, భాగ్య రెడ్డి వర్మ, జీవిత కథలను నృత్య రూపంలో ప్రదర్శనలు ఇస్తూ సమాజాన్ని చైతన్యం చేస్తున్నాడు. 

ఆయనే కామారెడ్డి కి చెందిన శాయం గారి వంశీ ప్రతాప్ గౌడ్. కళల రంగంలో పద్మశ్రీ అవార్డు కోసం కేంద్రానికి ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. భారతీయ నృత్య కళలను పరిరక్షించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాడు. 

కూచిపూడి కళా క్షేత్రం ఏర్పాటు..

కామారెడ్డి పట్టణానికి చెందిన సుశీల - పాపాగౌడ్ ల కుమారుడు వంశీ ప్రతాప్ గౌడ్.స్థానిక పాఠశాల,కళాశాలల్లో తన విద్యను అభ్యసించాడు. డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేసి నాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు.1992 సంవత్సరంలో " కూచిపూడి కళా క్షేత్రం" స్థాపించారు.అప్పటినుంచి వందలాది మంది విద్యార్థులకు నాట్యం నేర్పిస్తున్నారు.

నృత్య కళల పట్ల ఆసక్తి ఉండి,ఆర్థికంగా వెనుకబడిన వారికి ,ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈయన " ఉచితంగానే నాట్య శిక్షణ" ఇస్తున్నారు.విద్యార్థుల కళా ప్రదర్శనలకు దుస్తులు,రవాణా,భోజన ఖర్చులను కూడా ఈయనే స్వయంగా భరిస్తున్నారు.కూచిపూడి కళా క్షేత్రం లో నృత్యం నేర్చుకున్న వారిలో కొందరు సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు.మరి కొందరు నృత్య శిక్షకులుగా రాణిస్తున్నారు.

పెట్రోల్ బంక్ లో పార్ట్ టైమ్ వర్కర్ గా..

వంశీ ప్రతాప్ గౌడ్ కు చిన్నతనం నుంచే భారతీయ నృత్య కళలను నేర్చుకోవాలనే తపన ఉండేది.తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడవద్దని స్థానికంగా ఉన్న ఒక పెట్రోల్ బంక్ లో పార్ట్ టైమ్ బాయ్ గా పని చేశాడు. వంశీ ప్రతాప్ గౌడ్ హైద్రాబాద్ లో " అనిల్ కుమార్ రాంబాద్రి" వద్ద" కూచిపూడి", ,భువనేశ్వర్ లో "డాక్టర్ సనాలి ఆచార్య"  వద్ద " ఒడిస్సీ",బెంగళూరులో ప్రభాల్ గుప్తా వద్ద " కథాకళి", కోల్ కతా లో అమితార దత్తా వద్ద"కథక్" శిక్షణ ను పొందారు.

2014 లో నిజామాబాద్ లో దేవులపల్లి ప్రశాంత్ కుమార్ వద్ద " భరత నాట్యంలో",2015లో మణిపూర్ వెళ్ళి సర్గావి వద్ద " మణిపురి నృత్యంలో" శిక్షణ పొందారు.ప్రస్తుతం కూచిపూడి, భరత నాట్యం,కథక్,కథాకళి, మోహినీ ఆట్టము, మణిపురి,ఒడిస్సీ వంటి నృత్య కళల్లో మాస్టారుగా ప్రదర్శనలు ఇస్తున్నారు. రవీంద్ర భారతి వేదికగా ఏడు కళలను ఒకే నృత్య రూపంలో ప్రదర్శించి ఔరా అనిపించారు.

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్ ,లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ,జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వంశీ ప్రతాప్ గౌడ్ పేరు నమోదైంది.

ఔత్సాహిక విద్యార్థులు కూచిపూడి కళా క్షేత్రం, కామారెడ్డి లో "ఉచితంగా భారతీయ నృత్య కళలను"  వంశీ ప్రతాప్ గౌడ్ ఆధ్వర్యంలో నేర్చుకోవచ్చు.


ఉచిత మందులు@మెడిసిన్ బాబా ఫౌండేషన్, ఫరీదాబాద్.

 

ఖరీదైన మందులు కొనడానికి డబ్బులు లేక సతమతమయ్యే రోగులు చాలామంది ఉంటారు. అదే సమయంలో మిగిలిపోయిన మందులను చెత్తకుప్పలపాలు చేస్తున్నవారు ఎంతోమంది. ఇది తరచుగా అన్ని చోట్లా కనిపించే దృశ్యమే. కానీ ఈ విషయంలో మీనూ గోయల్ సరికొత్త పరిష్కారంతో ముందుకు వచ్చారు. ఆరు సంవత్సరాల క్రితం తన మిత్రులతో కలిసి ఆమె ఆరంభించిన మెడిసిన్ బ్యాంకు ప్రస్తుతం వేల మందికి ప్రాణదాతగా నిలుస్తోంది.. 

అది హర్యానాలోని ఫరీదాబాద్ పట్టణంలోని సెక్టార్ 35 లోని ఒక భవనము. జనం వరుసగా నిలబడి తమ వంతు వచ్చాక  మందుల చిట్టీ ని అక్కడున్న వాలంటీర్ల చేతులలో పెడుతున్నారు. వారు వాటిని పరిశీలించి.. అరలలో ఉన్న మందులను సంచులలో ఉంచి ..రోగులకో, వారి తరపు వారికో,వారి బంధువులకో అప్పగిస్తున్నారు. ఆ కేంద్రాన్ని స్థానికులు "మెడిసిన్ బ్యాంక్ " అని పిలుచుకుంటారు.

" మెడిసిన్ బాబా ఫౌండేషన్"  ద్వారా నడుస్తున్న ఈ కేంద్రం వ్యవస్థాపకురాలు మీనూ గోయల్. సాధారణంగా బ్యాంకులలో మనం డిపాజిట్ చేసిన డబ్బు మళ్ళీ మనమే తీసుకుంటాము. మా మెడిసిన్ బ్యాంకులో మనం డిపాజిట్ చేస్తే అవసరం ఉన్నవారు వాటిని విత్ డ్రా  చే. అదే రెండింటికి తేడా అంటారు మీను గోయల్ గారు. 

ఎన్నోఅపార్థాలు ,అనుమానాల నడుమ..

 మెడిసిన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆవేదనలో నుంచి వచ్చిందంటారు మీను గోయల్. మన దేశంలో రొట్టె ముక్క కొనుక్కునే స్తోమత లేని వారు కోట్ల మంది ఉన్నారు. వారికి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ ఫీజులకు, మందులు కొనుక్కోవడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. చాలా వైద్య కేంద్రాలలో మందులు ఉండవు. వాటిని కొనలేక ,వైద్యాన్ని ముందుకు కొనసాగించలేక ఎంతో మంది కృంగిపోతున్నారు. వ్యాధులు ముదిరి మరణిస్తున్నారు. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక చేదు వాస్తవం. అలాగే వ్యాధి నయమయ్యాక వైద్యులు వేరేవి వేసుకోమన్నారు అని చెప్పడం వలననో ,లేదా రోగులు మరణించాకో.. మిగిలిపోయిన మందులను చెత్త కుప్పల మీద పారేస్తున్నారు అనేది కూడా మరొక కఠిన వాస్తవం. వాటిని అవసరమైన వారికి అందిస్తే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు అనిపించింది నాకు. దాన్ని నా మిత్రులతో చర్చించాను. అలా ఆరు సంవత్సరాల క్రితం మెడిసిన్ బ్యాంకుకు అంకురార్పణ జరిగింది అని వివరించారు మీను.

 ఏ కొత్త ప్రయత్నానికైనా ముందు తలెత్తే బాలారిష్టాలు దీనికి వచ్చాయి. మా కాన్సెప్ట్ను కొందరు అపార్థం చేసుకున్నారు. మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు. కానీ మా నిబద్ధతను గమనించిన తర్వాత మద్దతుగా నిలబడ్డారు. ఆ విషయంలో మా బృందానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి అంటున్నారు మీను.

 సేకరణ కోసం బాక్సులు ..

12 మంది సభ్యుల ఆమె బృందంలో కార్పొరేట్ నిపుణులు, న్యాయవాదులు, బ్యూటీషియన్లు ఇలా వివిధ వృత్తుల వారు ఉన్నారు. ప్రారంభంలో ఇంటింటికి వెళ్లి మందులు సేకరించడం ప్రారంభించారు .తర్వాత సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కొద్ది రోజులలోనే మంచి స్పందన వచ్చింది. మందులను స్వయంగా తెచ్చి ఇచ్చేవారు కొందరైతే, కొరియర్ ద్వారా మరికొందరు అందిస్తున్నారు.  ఇప్పుడు విదేశాల నుంచి కూడా పంపిస్తున్నారు. మిగిలిన మందులను ఏం చేయాలా అని ఆలోచించే వారికి కూడా ఇప్పుడు తక్షణం గుర్తుకు వచ్చేది ఆ సంస్థ నే .దీనితో పాటు ఫరీదాబాద్ లోని బహిరంగ ప్రదేశాలు, ఆలయాలు, హౌసింగ్ సొసైటీలలో దాదాపు 30 మెడిసిన్ బాక్సులు ఏర్పాటు చేశారు. మిగిలిన మందులను జనం ఆ బాక్సులలో వేస్తే మీను బృందం వాటిని సేకరిస్తుంది. అలా అందిన మందులలో గడువు ముగిసిన వాటిని తొలగిస్తారు. మిగిలిన వాటిని కేటగిరిల వారిగా మెడిసిన్ బ్యాంకులో భద్రపరుస్తారు .రోగులు ప్రెస్క్రిప్షన్ను తీసుకొస్తే దాని ప్రకారం మందులు అందజేస్తారు.

 ఆ ఘనత వారిదే అంటున్న మీను..

 నగరంలో చాలామంది వైద్యులు మాతో కలిసి పనిచేస్తున్నారు. పేద రోగులను ఉచితంగా పరీక్షించి, ప్రిస్క్రిప్షన్లు రాసి మా దగ్గరకు పంపుతున్నారు. ఇప్పుడు సాధారణ ఇబ్బందుల నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు దాదాపు అన్ని సమస్యలకు మా దగ్గర మందులు ఉన్నాయి. వాటి వివరాలు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరైనా వచ్చి వాటిని తీసుకెళ్లొచ్చు. ఎవరి దగ్గరైనా మందులు ఉన్నాయని చెబితే వాటిని మేము కలెక్ట్ చేసుకుంటాము. ఇప్పటివరకు కొన్ని వేల మంది మా సంస్థ ద్వారా లబ్ధి పొందారు. వైకల్యాలు ఉన్న వృద్ధుల కోసం వీల్ చైర్లు తదితరాలు కూడా సమకూర్చుతున్నాము.

" మేము చేసేదంతా పూర్తిగా ఉచితమే". ఎవరి నుంచి విరాళాలు కానీ, వేరే సహాయం కానీ మేము తీసుకోవడం లేదు .మా వృత్తుల ద్వారా వచ్చేది మాకు సరిపోతుంది. వేరే ఖర్చులు ఏమైనా ఉంటే అందరం కలిసి పంచుకుంటున్నాం అని చెబుతున్నారు మీను గోయల్.

 అబ్బాయిలాంటి హెయిర్ కట్ ,ప్యాంటు షర్టుతో కనిపించే మీను తన వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా రోజు కనీసం రెండు గంటల సమయాన్ని ఈ కేంద్రం కోసం కేటాయిస్తారు. అత్యవసరమైతే అన్నివేళలా ఆమె బృందం అందుబాటులో ఉంటుంది. ఇదంతా మా ఘనత అని అనుకోవడం లేదు, పౌరులు తమ సామాజిక బాధ్యతగా భావించడం వలన మెడిసిన్ బ్యాంకు ను నడపగలుగుతున్నాం. ప్రజల భాగస్వామ్యం ,సహానుభూతి ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది అని అంటారు మీను వినయంగా. 

సపోర్ట్ అవర్ హీరోస్.. సైనికులకు ఉచిత సహాయం..

 జై జవాన్ అంటాము. వీర సైనికా వందనం అంటూ నినాదాలు చేస్తాము. ఆ సైనికులు, వాళ్ళ కుటుంబము క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటాము . నిజంగానే మన దేశము వాళ్ళని కంటికి రెప్పలాగే కాపాడుకుంటున్నది. సేవలలో ఉన్నప్పుడూ, ఆ తర్వాత మంచి ప్రయోజనాలు అందిస్తుంది .కాకపోతే అవన్నీ అందరికీ అందడం లేదు. ఇది నిజం. ముఖ్యంగా 15 ఏళ్ల కన్నా తక్కువ సర్వీస్ ఉన్న వాళ్లకి చేరడం లేదు .దాంతో వాళ్ళ స్థితి దుర్భరంగా మారుతుంది. అలాంటి కుటుంబాలకి సహాయపడుతున్నాడు 36 ఏళ్ల గౌరవ శుక్ల. ప్రతి సంవత్సరం సుమారు 70 కోట్ల రూపాయల ఖర్చుతో వారి అవసరాలు తీరుస్తున్నాడు. 

దిగ్రేష్ కుమార్ సైన్యంలో ఇంజనీర్ గా ఉండేవాడు. దుర్గమ మైన ప్రాంతాలలో సైన్యం వెళ్లడానికి మార్గాన్ని నిర్మించే" షాపర్గా"  సేవలందించాడు. 13 ఏళ్ల సర్వీస్ తర్వాత అతని మానసిక స్థితి దెబ్బతిన్నది. సైన్యం అతనికి రిటైర్మెంట్ ఇచ్చింది. మామూలుగా 15 ఏళ్లు పూర్తయ్యాక పదవి విరమణ పొందిన వాళ్లకి సైన్యం పెన్షన్ ఇస్తుంది .కాబట్టి దిగ్రేష్ కి ఆ ప్రయోజనం దక్కకుండా పోయింది . చేతికొచ్చిన గ్రాట్యూటీ రూపాయలు అతని చికిత్సకే సరిపోయాయి. అదీ ఫలించక చివరికి దిగ్రేష్ చనిపోయాడు. అప్పుడు ఆయన భార్య రోషినికి 42 ఏళ్ళు. పాప ఎనిమిదో తరగతి చదువుతుండేది. రోషిని తాను ఉంటున్న ఉత్తరాఖండ్లోని గర్వాల్లో మరే ఆదాయ వనరు లేక ఉపాధి హామీ పనులకి వెళ్ళసాగింది. రహదారి నిర్మాణంలో రాళ్ళు ఎత్తింది. అది కూడా మూడు నాలుగు నెలలే, మిగతా రోజులలో అర్థాకలి తో  పస్తులు ఉండేది. ఆ కుటుంబం గురించి గౌరవ శుక్లాకి తెలిసింది .తన సపోర్ట్ అవర్  హీరోస్ సంస్థ ద్వారా 60 వేల రూపాయలతో ఆమె చేత పూజా సామాగ్రి షాపు పెట్టించాడు గౌరవ శుక్లా. ఆరు నెలల్లోనే నెలకి 10,000 వరకు ఆదాయం అందుకోసాగింది రోషిని. అక్కడితో ఆగలేదు పుట్టగొడుగుల సాగునీ మొదలు పెట్టింది. ప్రస్తుతం మరో నలుగురు మహిళలకి ఉపాధి కల్పిస్తోంది ఆమె. 

రేష్మిత ఇంజనీరింగ్ చదువుకుంటుంది. తన తమ్ముడు జ్ఞానేశ్వర రావు.. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి. అటు రేష్మిత కాలేజీలోనూ ఇటు జ్ఞానేశ్వర్ రావుచదువు తున్న స్కూల్లోనూ ఎవరైనా చెబుతారు, ఆ ఇద్దరూ ఎంతటి ప్రతిభావంతులు అనేది. కానీ ఐదారు నెలల  కిందట ఆ ప్రతిభ దీపం మునిగపోయే పరిస్థితి వచ్చింది. రేష్మిత జ్ఞానేశ్వర్ల తండ్రి మాజీ సైనికుడు అయిన చంద్రశేఖర రావు కి వెన్నుపాములో కనితి ఏర్పడి పడకకే పరిమితమయ్యాడు. ఆ అనారోగ్యంతోనే రెండేళ్ల కిందట చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైది. ప్రభుత్వం ఇచ్చే వితంతు పెన్షన్  ఇంటి ఖర్చులకి సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలోనే రేష్మిత, జ్ఞానేశ్వర్ల చదువు బాధ్యతను తీసుకున్నది ఎస్ఓహెచ్ సంస్థ .వాళ్లకు కావాల్సిన ఫీజులు తనే చెల్లిస్తోంది. ఇలా ఒకటి, రెండు కాదు మన దేశంలో 22 రాష్ట్రాలకు చెందిన 350 మాజీ జవాన్ల కుటుంబాలను ఆదుకుంటుంది ఈ సంస్థ. వాళ్లలోనూ 65 ఏళ్లు పైబడిన వారికి శాశ్వత ప్రాతిపదికన నెలవారి వెచ్చాలు, ఔషధాలు, పిల్లలకు ఫీజులు ఇతరత్రా ఆర్థిక సహాయాలు అందిస్తోంది. 36 ఏళ్ల గౌరవ శుక్లా దీని వ్యవస్థాపకుడు. గౌరవ్ దీనిని ప్రారంభించడం వెనక గుండెని కదిలించే నేపథ్యం ఉంది.

పీతాంబరం తాతతో..

 గౌరవ శుక్లాది ఢిల్లీ .తండ్రి మాజీ జవాన్. కార్గిల్ యుద్ధంలో పోరాడినవాడు. తండ్రిలాగే తాను సైనికుడు కావాలనుకున్న గౌరవ్ సెలెక్ట్ కాలేదు. దానితో టీవీ జర్నలిజంలో డిగ్రీ చేసి, బాలీవుడ్లో క్యాస్టింగ్ డైరెక్టర్గా పనిచేశాడు. 2014 ప్రాంతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మాజీ సైనికులు నిర్వహించిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఆందోళనలు అతని జీవితాన్ని మార్చేశాయి. ఆ రోజు నుంచి పెన్షన్ లేని సైనికుల జీవితాల గురించి పరిశోధన మొదలుపెట్టాడు. వీడియో కథనాలు చేయసాగాడు. అప్పుడే ఒక ఫోటో అతని కంటపడిందట. అది పీతాంబరం తాత ఫోటో. ఆయన 1965, 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో సిగ్నల్ మెన్ గా పనిచేసిన వాడు .అనారోగ్యంతో ఉన్న తన తల్లికి సపర్యలు చేయాలని 1975లో పదేళ్ల సర్వీస్ తర్వాత సైన్యం నుంచి బయటకు వచ్చేసాడు. పెళ్లి చేసుకోలేదు. 1980లో తల్లి చనిపోతే ఒంటరిగా మిగిలాడు. పెన్షన్ లేదు కాబట్టి అన్ని రకాల పనులు చేశాడు. 75 ఏళ్ల తర్వాత కాలు విరిగి పనిచేసే శక్తి లేక ఢిల్లీ కన్నాట్ ప్లేస్ లో బిచ్చగాడిగా మారిపోయాడు .ఆ ఫోటోనే నేను చూసింది. నేను ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళగానే ఇంత కాలానికి నన్ను పలకరించే వారు వచ్చారా అంటూ బోరును ఏర్చాడు పితాబరం తాత. ఆయనకి నెల నెలా వెచ్చాలు, మందులను అందించడంతోటే మా ఎస్ఓహెచ్ సంస్థ ప్రారంభమైనది అంటాడు గౌరవ శుక్ల.

నెల నెలా 6 కోట్ల రూపాయలు..

 మొదట్లో తన సొంత సంపాదనతోనే మాజీ జవాన్లకు సహాయం చేసినా..పోను పోను రోటరీ వంటి సంస్థలు గౌరవ్  తో చేతులు కలిపాయి. ఆ తర్వాత మాజీ సైనిక అధికారుల సంఘాలు ,ఇతర వితరణ శీలురు అతనితో కలిసి నడవసాగారు. ఆ రకంగా 350 కుటుంబాలకి కావలసిన వివిధ అవసరాల కోసం నెల నెలా 6 కోట్ల రూపాయల మేర ఖర్చు పెడుతున్నాడు. భారతీయులందరి తరఫున మాజీ జవాన్ల రుణం తీర్చుకుంటున్నాడు గౌరవ శుక్ల తన సపోర్ట్ అవర్ హీరో సంస్థతో. 


30, సెప్టెంబర్ 2026, బుధవారం

ఉచిత ఫోటోగ్రఫీ శిక్షణ

 ప్రకృతి ఫోటోలు, జానపద గీతాల వీడియోలు, షార్ట్ ఫిలిం లు సినిమాల తరహాలో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఫోటో, వీడియోగ్రఫీలపై .. నేడు పల్లసీమల్లో యువతరం ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారికి ఈ వృత్తిలో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించి స్వయం ఉపాధి పొందేలా డిచ్ పల్లిలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ఉచితంగా శిక్షణ అందిస్తోంది. 

30 రోజుల కార్యక్రమంలో..

యువతకు కెమెరా ఆపరేటింగ్ తో పాటు మంచి ఫోటోగ్రాఫర్ గా రాణించేందుకు ఫోటోషాప్ పై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు.ఫోటోగ్రఫీ అంటేనే లైటింగ్,ఎడిటింగ్.లైటింగ్ సరిగా ఉంటేనే ఫోటోలు బాగా వస్తాయి.ఇందుకోసం నేచురల్, ఆర్టిఫీషియల్, కీ, ఫిల్ లైట్, బ్యాక్ లైట్ వంటి వాటి వినియోగం పై సందర్శక ప్రదేశాలలో శిక్షణ ఇస్తున్నారు.ఇందులో భాగంగా వీడియో షూటింగ్ కూడా నేర్పిస్తున్నారు. ఏ ప్రదేశంలో ఎలాంటి లెన్స్ వాడాలి అనేది వివరంగా చెబుతున్నారు.

మరో వైపు స్టూడియో లైటింగ్ పరికరాల వాడకం పై ప్రత్యక్ష సాధన చేయిస్తున్నారు.అనంతరం వారాంతపు పరీక్షలు నిర్వహించి అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా వారి నైపుణ్యాలను అంచనా వేస్తున్నారు.ఇలా 30 రోజుల పాటు జరిగే ఈ ఉచిత శిక్షణ లో ఫోటో, వీడియోగ్రఫీ ల పై యువత పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తోంది. శిక్షణ సమయంలో ఉచిత వసతి కల్పిస్తున్నారు. అనంతరం స్వయం ఉపాధి కోసం వ్యాపారం చేయడం కొరకు బ్యాంకుల ద్వారా అభ్యర్థులకు రుణాలు ఇప్పించేలా సంస్థ అధికారులు కృషి చేస్తున్నారు. 

ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి..

రవి కుమార్, SBI శిక్షణ సంస్థ డైరెక్టర్..

వెడ్డింగ్,ఈవెంట్,ఫ్యాషన్ ఫోటోగ్రఫీలతో పాటు సొంతంగా స్టూడియో ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి మేం ఇస్తున్న శిక్షణ వారు జీవితంలో స్థిరపడేలా ఉపయోగపడుతుంది.ఇప్పటివరకు 432 మంది ఫోటోగ్రఫీ లో శిక్షణ పొందగా ,51 మంది సొంతంగా స్టూడియో లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కోర్సులో చేరాలనుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. 20 నుంచి 30 మంది తో ఒక బ్యాచ్ ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ ఇస్తున్నాం. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ ఉచిత శిక్షణ ను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలి అని డైరెక్టర్ అన్నారు. 

ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ఆయన తెలిపారు.

16, సెప్టెంబర్ 2026, బుధవారం

ఫ్రీ మెంబర్ షిప్ @ కేర్ సంఘం, ప్రణాం

 కేర్ హాస్పిటల్స్ వారు నిర్వహించే స్వస్థ్ రథ్ ద్వారా సేవలు పొందే వారికి కేర్ సంఘం మరియు సీనియర్ సిటిజెన్ల కోసం ప్రణాం కార్యక్రమాల్లో "ఉచిత సభ్యత్వం"  కల్పించనున్నారు . ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షాలను చేరువ చేయడంతో పాటు నివారణ ఆరోగ్యం పై అవగాహన పెంచేందుకు కేర్ హాస్పిటల్ స్వస్థ్ రథ్ కార్యక్రమం ప్రారంభించింది. మలక్పేటలోని కేర్ హాస్పిటల్స్ లో ఏఐఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్ స్వస్థ్ రథ్ జండా ఊపి ప్రారంభించారు.  కార్యక్రమంలో సిఐ మురారి ,ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎడ్ల, డాక్టర్ శ్రీధర్ సీనియర్ వైద్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్వస్థ్ రథ్ హైద్రాబాద్ లో వివిధ ప్రాంతాలలో పర్యటించనున్నది. కాలనీ లో కమ్యూనిటీ కేంద్రాలు, నివాస ప్రాంతాలు, పార్కులు, సీనియర్ సిటిజన్ క్లబ్బులు తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య పరిక్షలు నిర్వహించడంతోపాటు నివారణ, ఆరోగ్యం పై అవగాహన కల్పించనున్నది. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, అవసరమైనప్పుడు సకాలంలో వైద్యులను సంప్రదించడం పై ప్రజలకు సూచనలు అందించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్హాసన్ ఎఫెండీ మాట్లాడుతూ ఆరోగ్య సేవలు ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత ప్రయోజనం అన్నారు. ఈ కార్యక్రమం  ద్వారా కాలనీలు, కమ్యూనిటీ ప్రాంతాల్లోనే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు అందించడం మంచి కార్యక్రమం అన్నారు. ప్రవీణ్ కుమార్ ఎడ్ల మాట్లాడుతూ స్వస్థ్ రథ్ ద్వారా  ప్రజలు నివసించే ప్రాంతాలకే ప్రాథమిక ఆరోగ్య పరీక్లను తీసుకెళ్తున్నాం. ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే వరకు వేచి చూడకుండా ముందుగానే పరీక్షలు చేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించడమే మా లక్ష్యం అన్నారు. కేర్ హాస్పిటల్స్ చేపడుతున్న" కేర్ సంఘం " సీనియర్ సిటిజెన్ల కోసం" ప్రణాం"  కార్యక్రమాలలో ఉచిత సభ్యత్వం కల్పించనున్నారు. 

14, సెప్టెంబర్ 2026, సోమవారం

ఉచిత శిక్షణ @ డా డి.రామానాయుడు విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి సంస్థ

 మెదక్ జిల్లాలోని తునికి గ్రామంలో గల డా. డి. రామానాయుడు విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం  గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు.

ప్రస్తుత సంవత్సరంలో కింది కోర్సులకు దరఖాస్తులు కోరుతోంది. 

వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ..

అర్హత.. పదవ తరగతి,

కాలవ్యవధి.. ఆరు నెలలు,

సౌకర్యాలు..చదువుతో పాటు భోజన వసతి,

శిక్షణ..రెసిడెన్షియల్..

సేల్స్ /  మార్కెటింగ్ లో శిక్షణ..

అర్హత.. ఇంటర్ 

కాల వ్యవధి..ఏడాది..

ప్రారంభ తేదీ..సెప్టెంబర్ 30,

చిరునామా..

డా డి రామానాయుడు విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి సంస్థ,

తునికి,

కౌడిపల్లి మండలం - 502316

మెదక్ జిల్లా ,

తెలంగాణ.


పూర్తి సమగ్ర వివరాలకు..93819 59372, 84669 42278



ఫ్రీ గణపతి అర్చన@వేదమందిర్

ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వేద మందిర్ వారు ఇప్పుడు ఫ్రీ గా , 100% ఉచితంగా మీ పేరు మీద " గణపతి అర్చన" జరుపుకునే అవకాశం కల్పిస్త...