16, ఆగస్టు 2026, ఆదివారం

ఉచిత కోచింగ్ కు కేంద్రం శ్రీకారం

 పేద మధ్యతరగతి కుటుంబాలకు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకోవడం అనేది పెద్ద భారంగా మారిందని,  ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను  కోచింగ్ తరగతులకు పంపకపోతే తాము గౌరవనీయమైన కుటుంబం  కాదని భావిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 

ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశానికి ఇచ్చిన సందేశంలో ప్రధాని మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని వారు కోచింగ్ కోసం ఖర్చు చేస్తున్న వేలాది కోట్ల రూపాయలను ఆదా చేయించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. మన యువత తమ కుటుంబాల దగ్గరే ఉండి వారి సంరక్షణ పొందాలి అదనపు ఆర్థిక భారం పడకూడదు కాబట్టి దేశ యువతకు వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించాలని నిర్ణయించుకున్నామని ప్రధాని తెలిపారు. మన వద్ద ఉన్న అద్భుతమైన ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు, అందుబాటులో ఉన్న డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు కలిపి "దేశ యువతకు ఉచిత కోచింగ్ అందించే సమగ్ర వ్యవస్థను"  నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చర్య ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు ఆదా చేసుకోగలుగుతాయి. వారి పిల్లలు ఇంటి దగ్గరే ఉండే సిద్ధం కావచ్చు, తల్లిదండ్రులు వారిని సంరక్షించుకోవచ్చు అని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. 

వచ్చే ఏడాది లో ఒక కోటి మంది యువతకు ఏ ఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని సంకల్పం తీసుకున్నామని ,వారు ఏ ఐ ప్రపంచానికి నాయకత్వం వహించాలని ప్రధాని ఆకాంక్షించారు.

ఉచిత అన్నదాన భవనం@ బోధన్

 నిజామాబాద్ జిల్లా లోని బోధన్ పట్టణం లోని నర్సి రోడ్డు మారుతీ మందిరం వద్ద భక్తుల సౌకర్యార్థం " ఉచిత అన్న దాన భవనం" నిర్మాణం చేయడం అభినందనీయమని బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి గారు అన్నారు. 



శనివారం భవనంలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం భవన నిర్మాణం చేపట్టిన కృష్ణ సైకిల్ స్టోర్స్ యజమాని వి. నరసింహ రావు గారి ని ఆలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్ రావు, శివాలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. 

దో ఘంటే దేశ్ కే నామ్.. ఢిల్లీ వైద్యుల ఉచిత సేవ

 దేశం కోసం రెండు గంటలు.. 2 ఘంటే దేశ్ కే నామ్.. అనే ఆరోగ్య సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములం అవుతామంటూ ఢిల్లీ వ్యాప్తంగా పలువురు వైద్య నిపుణులు ముందుకు వస్తున్నారు. 

పేద, నిరుపేద వర్గాలకు చెందిన రోగులకు ప్రతి వారం " 2 గంటల ఉచిత కన్సల్టేషన్ సేవలు " అందించనున్నట్లు శని వారం ప్రకటించారు.కార్డియాలజీ, ఎండో క్రైనాలజీ,పీడియాట్రిక్ ,గైనకాలజీ, జనరల్ మెడిసిన్ సహా ఇతర స్పెషలిస్టులు క్రమంగా దీంట్లో నమోదు చేసుకుంటున్నారు.

మారుమూల ప్రాంతాల్లోని రోగుల కోసం " వర్చువల్ కన్సల్టేషన్ స్లాట్" లను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పిల్లల ఆరోగ్యం నుంచి మానసిక ఆరోగ్యం వరకు .. వైద్య నిపుణుల సేవలు అందిస్తామని డాక్టర్ ఇకేదా తెలిపారు.

15, ఆగస్టు 2026, శనివారం

తెలుగు రాష్ట్రాల రైతులకు.. 3 రోజుల ఉచిత శిక్షణ

 జాతీయ స్థాయి సంస్థ అయిన ఎన్ ఐ పి హెచ్ ఎం పర్యావరణహితమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై శాస్త్రవేత్తలతో పాటు రైతులకు కూడా శిక్షణ ఇస్తోంది. వర్మీ కంపోస్టులో ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రం సూడో మోనాస్ బ్యాక్టీరియా కలిపి సేంద్రీయ ఎరువు తయారు చేసుకోవడం.. పొటాష్, ఫాస్ఫేటులను మొక్కలకు అందుబాటులోకి తెచ్చే జీవన ఎరువులను , జీవ రసాయనాలను రైతు స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం, మిత్ర పురుగుల సంతతిని పెంపొందించే చర్యలపై శిక్షణ ఇస్తారు. 

కనీసం 20 మంది రైతులు బృందంగా ఏర్పడి తమను 040-24015932 నంబరులో సంప్రదిస్తే " 3 రోజుల పాటు శిక్షణ ఉచితంగా " ఇస్తామని ఎన్ఐపిహెచ్ఎం మొక్కల ఆరోగ్య నిర్వహణ విభాగం సంచాలకులు తెలిపారు. ఐతే భోజన ఖర్చులు రైతులే భరించాల్సి ఉంటుందని తెలిపారు. ఇటీవల గుంటూరు ప్రాంత రైతులకు మిరప, పొగాకు సాగు లో శిక్షణ ఇచ్చామన్నారు. 

కేరళ, తమిళ నాడు ల నుండి శాస్త్ర వేత్తలు, రైతులు అధిక సంఖ్యలో శిక్షణ పొందుతున్నారని అధికారి తెలిపారు.తెలుగు రాష్ట్రాల రైతులు ఇట్టి ఉచిత శిక్షణ అవకాశాన్ని అధిక సంఖ్యలో ఉపయోగించుకుని లాభం పొందాలని కోరారు.

ఉచితంగా.. దంత వైద్య సేవలు..

 ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అని అంటారు.. అయిన వారికి దూరమై, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న పిల్లలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మేమున్నాం అంటూ " లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్" సంస్థ భరోసా ఇస్తోంది. 

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్, ఐ కే ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయిన్ పల్లి , బాపూజీ నగర్ లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో " ఉచిత దంత వైద్య సేవలు" అందుబాటులోకి తెచ్చింది. 

ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ సభ్యులు ఆర్. నారాయణ, ఆర్గొండ నర్సింలు, బచ్చు లక్ష్మణ్, కే. లింగయ్య లు అతిథులుగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 180 మందికి సేవలు అందించినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని వారు తెలిపారు. 

14, ఆగస్టు 2026, శుక్రవారం

మెడి కవర్ ఆసుపత్రిలో ప్రతినెలా ఫ్రీ క్యాన్సర్ క్యాంప్

క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సతో వ్యాధి నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందని హైదరాబాద్ మెడి కవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆంకాలజిస్టులు సూచించారు.

 కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ లో "ప్రతి నెల రెండో గురువారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని"  నిర్వహించనున్నట్లు మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డాక్టర్లు.. డాక్టర్ అన్వేష్, డాక్టర్ నీలేష్ ,డాక్టర్ స్నేహ తెలిపారు. గురువారం హాస్పిటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్లతో కలిసి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ పాల్గొని మాట్లాడారు. 

కరీంనగర్ మెడి కవర్ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన మొదటి ఉచిత క్యాన్సర్ శిబిరంలో 186 మందికి పరీక్షలు చేయగా అందులో 26 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. క్యాన్సర్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇకపై" ప్రతినెలా రెండో గురువారం"  కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో" ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని "నిర్వహించాలని నిర్ణయించినట్లు డాక్టర్లు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి అన్నారు. హాస్పిటల్ లో కల్పించిన ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ముందస్తు ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో వైద్యులు మాట్లాడుతూ కరీంనగర్లో ముఖ్యంగా "బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా " నమోదు అవుతున్నాయని తెలిపారు. మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తుందన్నారు. అయితే క్యాన్సర్ లక్షణాలు స్పష్టంగా బయటపడకముందే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని తొలి దశలో గుర్తించి తగిన చికిత్స అందించవచ్చు  అన్నారు.

 క్యాన్సర్ బారిన పడకుండా కొంతమంది నైనా కాపాడాలనే ఉద్దేశంతో మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం" ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలని " నిర్వహిస్తోందని వైద్యులు తెలిపారు. ముందస్తు గుర్తింపు, సరైన సమయంలో చికిత్స, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా క్యాన్సర్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.

మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ సంపత్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, పిఆర్ అబ్దుల్ వకీల్ తదితరులు పాల్గొన్నారు. 



ఉచిత చేనేత శిక్షణ @ దోమకొండ

 దోమకొండలో చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకు రావడానికి దోమకొండ గడికోట ట్రస్ట్ వారి సహకారంతో "ఉచిత చేనేత శిక్షణ తరగతులు"నిర్వహిస్తున్నట్లు హైద్రాబాద్ చేనేత సేవా సంస్థ ప్రతినిధులు పవన్, సంతోష్ లు తెలిపారు. 

గురువారం దోమకొండ మండల కేంద్రంలోని ఉమా బాగ్ లో చేనేత శిక్షణ తరగతులు ప్రారంభించి ,మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐరేని నర్సయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్ధరాములు, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, గడికోట ట్రస్ట్ సీనియర్ మేనేజర్ బాబ్జీ, ప్రతినిధులు పాల్గొన్నారు. 

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...